పోడు భూముల సమస్య పరిష్కారానికి రైతుల పక్షాన పోరాడుతున్న తాము పోలీస్ కేసులకు భయపడేది లేదని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ భాజపా నేత పాల్వాయి హరీశ్ బాబు స్పష్టం చేశారు. తెరాస ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు పోడు భూముల సమస్య పట్ల చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
పోడు రైతుల పక్షాన ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేస్తున్న తమపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపారని పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. ఒక కేసు తర్వాత మరో కేసు అంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే దాని వెనకున్న ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడు లేని పోడు భూముల సమస్య తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాకే మొదలైందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పోడు రైతుల పక్షాన నిలబడి సమస్యను ముఖ్యమంత్రికి వివరించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పోడు భూములకు పట్టాలిప్పిస్తామని చెప్పి.. గెలిచిన ఎమ్మెల్యే ఇంతవరకు ఎన్ని పట్టాలు ఇప్పించారో చెప్పాలని హరీశ్ బాబు కోరారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా పోడు రైతుల పక్షాన భాజపా ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి: 'కొత్త పార్టీ పరిష్కారం కాదు.. అందరం ఏకమవుదాం'