కుమురంభీం జిల్లా దహేగాం మండలంలోని ఎర్ర వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు 15 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడం వల్ల అటువైపుగా వెళ్లేవారు అసంపూర్తిగా ఉన్న వంతెన పైకి ఎక్కి దిగాల్సిందే. దహేగాం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గర్భిణీ ఎల్కారి భారతికి పురిటి నొప్పులు రావడంతో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రాంపూర్ నుంచి ఎర్రవాగు వరకు 20 కిలోమీటర్లు ప్రైవేటు వాహనంలో తరలించారు. అసంపూర్తిగా ఉన్న వంతెన దాటి అంబులెన్స్ రాకపోవడం వల్ల నిండు గర్భిణీ భారతి పురిటి నొప్పులతోనే అర కిలోమీటరు పొడవున్న అసంపూర్తి వంతెనపై నడిచి అంబులెన్స్ ఎక్కింది. అక్కడి నుంచి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాలకుల చిన్నచూపు, అధికారుల నిర్లక్ష్యమో తెలియదుగానీ ఆ ఊరి ప్రజలకు ఇలాంటి ఇక్కట్లు ప్రతినిత్యం ఎదురవుతూనే ఉంటాయి.
ఇవీ చూడండి: 60 ఏళ్ల వయస్సు... పడి పడి లేచే మనస్సు!