కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం బోడపల్లి మా స్వగ్రామం. అమ్మానాన్న తిరుపతి-రాజేశ్వరీ రెండు ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంటారు. నాకు అక్క, చెల్లితోపాటు ఒక తమ్ముడు. అక్కకు వివాహమైంది. ఆ అప్పులే ఇంకా ఉన్నాయి. చేదోడుగా ఉంటానని నాన్న చదువిక చాలనేవారు. మా గ్రామంలో ఎనిమిదో తరగతి వరకే ఉంది. పది వరకు కొనసాగించాలంటే మూడు కిలోమీటర్ల దూరంలోని ఇట్యాల ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలి. శంకర్రావు అనే మాష్టారు సాయంతో నాన్నను ఒప్పించా.
రోజూ ఆటోలోనో కాలినడకనో పాఠశాలకు వెళ్లేదాన్ని. 2019లో 9.3 గ్రేడింగ్‌తో పది పూర్తిచేశా. అప్పుడూ చదువు చాలన్న మాటే. ఈ ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు కళాశాలలో చదివించలేమన్నారు. మళ్లీ శంకర్రావు మాష్టారే నచ్చజెప్పి, దహెగాం కస్తూర్బా కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ)లో చేర్పించారు. చదువు ఎలాగైనా కొనసాగించాలనే లక్ష్యం ముందు ఇంకేమీ కనిపించేవి కావు. ఫలితంగా 976 మార్కులొచ్చాయి. తెలంగాణ కస్తూర్బా కళాశాల (Telangana Kasturba College)ల్లో నాదే మొదటి ర్యాంకు.
పది మందికి జ్ఞానం పంచే బోధనావృత్తి అంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. అది తెలుసుకుని ఉపాధ్యాయులు ఇంటర్ తర్వాత డీఈఈసెట్-డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (Diploma in Elementary Education) ప్రవేశపరీక్ష రాయమన్నారు. దరఖాస్తు చేశా. కోచింగ్ తీసుకునే స్థోమత లేదు. సొంతంగా చదివా. తెల్లవారుజామున ఉదయం 3 గం. నుంచి 8 గం. వరకు, రాత్రి 8 గం. నుంచి 11 గం.సమయాన్ని సన్నద్ధతకు కేటాయించేదాన్ని. ఈ ర్యాంకు నన్నే కాదు అమ్మానాన్నల్నీ సంతోషపరిచింది. అందుకే చదవాలన్న కోరికను గెలిపించుకోవడంలో నాకిది పెద్ద విజయమే. ఉపాధ్యాయురాలినై, ఆపై సివిల్స్ దిశగా వెళ్లాలన్నది భవిష్యత్ లక్ష్యం. ఇక ఈ దిశగా కృషి చేస్తా.
ఇదీ చూడండి: మట్టిలో మాణిక్యాలు.. బాసర ట్రిపుల్ ఐటీలో చోటు దక్కించుకున్నారు