CPM leader Protest: అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని సీపీఎం నాయకుడు వినూత్నంగా నిరసన తెలిపారు. కుమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో వర్షపు నీటిలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ప్రమాదాలకు గురవుతున్నా అధికారుల్లో చలనం లేదని సీపీఎం నాయకుడు ఆనంద్ మండిపడ్డారు.
రోడ్లపై గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో అనేకమంది ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. పోలీసులు, అధికారులు నిరసనను విరమించాలని చెప్పినా ఫలితం దక్కలేదు. ప్రధాన రహదారి కావడంతో వాహనాలు పెద్దఎత్తున నిలిచిపోయాయి.
ప్రధాన రహదారి పూర్తిగా నాశనమైపోయింది. ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకున్నా పాపాన పోలేదు. రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఉంటే పట్టించుకోరా? అధికారులు ఏం చేస్తున్నారు. వాహనదారుల ప్రాణాలు పోతుంటే మీకు బాధ్యత లేదా? రోడ్ల సమస్యలను పరిష్కరించే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు. - ఆనంద్, సీపీఎం నాయకుడు
సిర్పూర్ పేపర్ మిల్లుకి సంబంధించిన రోడ్ కావడంతో విస్తరణ పనులకు ప్రతిపాదనలు ఉన్నా ఆచరణ సాధ్యం కావటం లేదని అధికారులు వివరించారు. పేపర్ మిల్లు అధికారులతో మాట్లాడిన మున్సిపల్ సిబ్బంది.. నీటి తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరింది. పనులు తక్షణమే ప్రారంభిస్తామని అధికారులు హామి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయినప్పటికీ నిరసన విరమించకపోవడంతో పోలీసులు సీపీఎం నాయకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చదవండి: హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి.. కేటీఆర్ వెల్‌కమ్
విషమంగా లాలూ ఆరోగ్యం.. సీఎం పరామర్శ.. చికిత్స కోసం సింగపూర్‌కు!