కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ డివిజన్లోని పలు వ్యాక్సిన్ కేంద్రాల్లో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ జరుగుతోంది. నిత్యం వందల మందిని కలిసే అవకాశమున్న వారిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి.. ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో పౌర సరఫరాల శాఖ, జర్నలిస్టులు, ఫెర్టిలైజర్ నిర్వాహకులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, పెట్రోల్ బంక్ సిబ్బందితో పాటు చిరువ్యాపారులు ఉన్నారు. ఇప్పటికే వివిధ కేంద్రాల వద్ద లబ్ధిదారులు వరుసలో ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు టీకా పంపిణీ కొనసాగుతుంది. 3 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని టీకా కేంద్రాన్ని ఆర్డీఓ చిత్రు, తహశీల్దార్ ప్రమోద్ కుమార్, పురపాలక కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. వారం రోజుల్లో సూపర్ స్ప్రెడర్లకు టీకాలు పూర్తి చేస్తామని తెలిపారు. లబ్ధిదారులకు ముందుగానే అధికారులు టోకెన్లు జారీ చేశారు. టోకెన్లు పొందని వారు కూడా గుర్తింపు కార్డులు చూపించి వ్యాక్సిన్ వేసుకోవాలని అధికారులు తెలిపారు.
సమన్వయ లోపం
కానీ అధికారుల సమన్వయ లోపం వల్ల టీకా కేంద్రం వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. దీంతో లబ్ధిదారులు సుమారు గంట సేపు వేచి చూడాల్సి వచ్చింది. రెవెన్యూ, వైద్యాధికారులు ఇచ్చిన పేర్లు సరిపోలకపోవడం, లబ్ధిదారులకు అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో సమస్య నెలకొంది. దీంతో తహశీల్దార్ ప్రమోద్ కుమార్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను వివరించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లబ్ధిదారులకు టీకాలు వేశారు.
ఇదీ చదవండి: Vote For Note Case: తెలంగాణ అ.ని.శా.కు సుప్రీం నోటీసులు