కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో హరిత హననంపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇంఛార్జి డా.పాల్వాయి హరీశ్‌బాబు తెలిపారు. రెండు రోజుల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ... స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెట్ల నరికివేతతో సంబంధం లేదని.. నరికిన వ్యక్తి ఎవరో తనకు తెలియదనడం విడ్డురంగా ఉందన్నారు.
తెరాసకు చెందిన కో ఆప్షన్ సభ్యుడు మహేబూబ్ ఖాన్... ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడన్న విషయం అందరికి తెలిసిందేనని పేర్కొన్నారు. రహదారి పక్కన చెట్లు నరకడానికి అనుమతి తీసుకున్నామని చెబుతున్నారన్నారు. చెట్లు నరకడానికి కనీస నియమాలు పాటించకుండా అధికారులు అప్పటికప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. ఈ హరిత హననంపై ప్రభుత్వ కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫారెస్ట్ అధికారులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశామని... ఉన్నతస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.