మట్టి విగ్రహాలే ఎందుకు ఉపయోగించాలి అనేది సహజంగా కలిగే అనుమానం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీలో రసాయనాలు ఉపయోగిస్తారు. చెరువులు నదుల్లో వీటిని విడిచి పెట్టినప్పుడు అవి పూర్తిగా కరుగవు. వాటిలోనున్న విష పదార్థాల వల్ల మనుషులకు చర్మవ్యాధులు.. జలచరాలకు ప్రాణాంతక వ్యాధులు వస్తాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
భక్తి కారాదు విషతుల్యం
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వివిధ రసాయనాల రంగులతో తయారైన విగ్రహాల్లో.. కాపర్ సల్ఫేట్, అల్యూమినియం బ్రోమైడ్, లెడ్ ఆక్సైడ్, మెర్క్యురీ సల్ఫైడ్, మెగ్నీషియం, సిలికాన్, ఆర్సెనిక్, జింక్ ఆక్సైడ్, రెడ్ ఆక్సైడ్, కోబాల్ట్, మాంగనీస్ డై ఆక్సైడ్, మాంగనిస్ సల్ఫేయిడ్, వైట్ స్పిరిట్, టర్ఫేన్, వార్నిష్ తదితరాలు ఉంటాయి. ఈ హానికారక మూలకాలు చెరువులు కుంటల్లో కలుస్తాయి. జలం గరళంగా మారుతుంది. సమీపంలోని భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. ఈ విగ్రహాలను నిమజ్జనం చేసిన చెరువులోని చేపలు తింటే మెర్క్యురీ మూలకం శరీరంలోకి చేరుతుంది. మెదడులోని నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. చెరువుల్లో లేదా కుంటల్లో పెరిగే అరుదైన వృక్ష జాతులు కనుమరుగవుతాయి.
ప్రజల్లో మార్పు రావాలి
వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతి విగ్రహాలను కొలువుదిర్చేలా ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు గత కొన్నాళ్లుగా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. అనేక సంస్థలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఫలితంగా పట్టణాలనుంచి పల్లెలకు గణపతుల ఆరాధన పెరిగింది. వెయ్యి అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. పల్లెలు పట్టణాలు అనే భేదం లేకుండా మార్పువస్తుంది అనడానికి నిదర్శనం ఏటా పెరుగుతున్న మట్టి విగ్రహాల తయారీయే. పూజకు ఉపయోగించే విగ్రహం.. వెదురు పందిరి.. ఖద్దరు వస్త్రాలు.. ఇవన్నీ కులవృత్తులకు ఉపాధి కల్పించేవే. కార్పొరేట్ కంపెనీల సహాయంతో కొన్ని సంస్థలు శిక్షణ నిర్వహిస్తున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థులకు కంపెనీల్లో ఉద్యోగులకు తాము స్వయంగా బంకమట్టితో తయారు చేయించిన వాటిని పూజించే అవకాశం కల్పిస్తున్నాయి.