కుమురం భీం జిల్లా కొండపల్లిలో రైతుల కోసం భాజపా నేతలు చేస్తున్న దీక్షను పోలీసులు అర్ధరాత్రి బలవంతంగా భగ్నం చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. అమాయక పేద మహిళా రైతులపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అర్ధరాత్రి పోలీసులు దీక్షాశిబిరంపై ఆకస్మిక దాడి చేయడంతో భాజపా నేతలు పాల్వాయి హరీశ్, సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. పేదలు ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని మండిపడ్డారు.
హైదరాబాద్ చుట్టూ పక్కల తెరాస నేతలు కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేసినా.. పట్టించుకోని ప్రభుత్వం ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పేద రైతులపై ప్రతాపం చూపిస్తారా అని ధ్వజమెత్తారు. ఆసిఫాబాద్ ప్రజాస్వామ్య తెలంగాణలో ఉందా.. అరాచక రాజ్యంలో ఉందా అనేది అర్థం కావడం లేదన్నారు.
- ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా పంజా.. ఒకేరోజు 2909 కేసులు