ఎరువుల వ్యాపారులు పురుగు మందులు, విత్తనాలను విక్రయించే సమయంలో అక్రమాలు నిరోధించడం కోసం పాయింట్ ఆఫ్ సేల్ అందజేయాలని ప్రభుత్వం గత ఏడాది సంకల్పించింది. యంత్రాలు వినియోగించని వ్యాపారుల అనుమతులు రద్దు చేయాలని సూచించింది. అందుకు తగ్గట్లు వ్యాపారులకు శిక్షణ కూడా ఇచ్చారు. కానీ అది ఆచరణలో పెడుతున్న దాఖలాలు మాత్రం ఎక్కడా లేవు.
ఇంటి వద్దకే అంటూ అధిక ధర
దుక్కి దున్ని పొలాన్ని చదును చేయకముందే అన్నదాతలను నిలువు దోపిడీ చేయడానికి దళారులు, వడ్డీ వ్యాపారులు రంగంలోకి దిగారు. రైతుల ఇంటి వద్దకే ఎరువుల బస్తాలను తెచ్చిస్తామని వ్యాపారులు అధిక ధరలకు వారికి అంటగడుతున్నారు. యంత్రాల వినియోగం రాయితీ గురించి తెలియని కర్షకులు వ్యాపారులు చెప్పిన ధరని చెల్లిస్తూ ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. 45 కిలోల నాగార్జున యూరియా బస్తా... రాయితీ పోను అన్నదాతకు 266 రూపాయలకు విక్రయించాలి. కానీ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంక్సాపూర్లో గత నాలుగు రోజులుగా 8 లారీల యూరియాను అమ్మగా... ఒక్కొక్క యూరియా సంచిని మూడు వందల నుంచి 350 రూపాయల వరకు అమ్మి కర్షకుల కష్టాన్ని దోచుకున్నారు.
పంట కాలంలో కృత్రిమ కొరత
వర్షాలు పడిన అనంతరం యూరియా దొరుకుతుందో లేదోనని రైతులు ముందుగానే కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటున్నారు. పంట కాలంలో సైతం కృత్రిమ కొరతను సృష్టించి వ్యాపారులు డబ్బులు దండుకోవడం గిరిజన ప్రాంతాల్లో సర్వసాధారణమై పోతున్నది.
సరుకును పూర్తిగా ఇష్టానుసారంగా విక్రయించిన వ్యాపారులు రాయితీ డబ్బుల కోసం బినామీ రైతుల వివరాలను పిఓఎస్ యంత్రాల్లో తీరిగ్గా పొందుపరుస్తున్నారు. లారీల కొద్ది సరుకును పక్కదారి పట్టిస్తున్న వ్యాపారులు తమకు రైతుల పేరుతో 50,100 ఎరువుల సంచులు అమ్మినట్లు కాకి లెక్కలు తయారు చేస్తున్నారు.