కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయినప్పుడు సుమారుగా 140 మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆ తర్వాత 405 మందికి కొవిడ్ సోకినట్లు తెలిపారు. ఇప్పుడు లింగాపూర్ మండలంలోని ఐదు గ్రామాల్లో కోలుకున్న 405 మందికి కొవిడ్ ఉన్నప్పటికీ ఒక్క మరణం కూడా సంభవించకుండా గ్రామస్తులు జాగ్రత్తలు పాటించారు. రాష్ట్రంలోనే లింగాపూర్ మండలం స్ఫూర్తిగా నిలిచింది.
మొత్తం 405 కేసులు
లింగాపూర్ మండలంలోని మోతీపటార్ గ్రామంలోని గిరిజనుల్లో ఓ తెగ మార్చి 28న హోలీ పండుగను ఘనంగా నిర్వహించింది. దీనికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సుమారు 700 వందల మంది తరలివచ్చారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ నుంచి సైతం కొందరు వ్యక్తులు వచ్చి ఆడిపాడారు. ఈ క్రమంలో మొదటగా ఈ నెల 5న మోతీపటార్ పక్క గ్రామమైన కొత్తపల్లిలో ముగ్గురు వ్యక్తులు జ్వరంతో బాధపడుతుండడంతో సిర్పూర్(యూ) ఆసుపత్రిలో కొవిడ్ పరీక్ష చేయించుకున్నారు. వీరందరికి పాజిటివ్ వచ్చింది. మరుసటి రోజు ఎనిమిది మంది చేయించుకోగా వారికీ కరోనా సోకినట్లు తేలింది. డీఎంహెచ్‌ఓ కుమురం బాలు ఆధర్వంలో గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి అందరి నుంచి నమూనాలను సేకరించారు. మొదటి రోజే ఈ గ్రామంలో 106 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇక్కడ 132 కేసులు తేలాయి. అప్రమత్తమైన అధికారులు ఈ గ్రామం పక్కనే ఉన్న మోతీపటార్(89), పట్కల్‌మంగీ(14), పిక్లతాండ(96), వంకమద్ది(74)లో పరీక్షలు నిర్వహించారు. ఏకంగా మొత్తం 405 కేసులు నమోదయ్యాయి. మారుమూల ప్రాంతాల్లో ఉండే ఈ గూడేల్లో ఇంత మంది కరోనా బారిన పడటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.
అధిగమించారిలా..
కొవిడ్ బాధితులు గల ప్రతి గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామస్థులెవరూ బయటకు రాకుండా, కొత్త వ్యక్తులు ప్రవేశించకుండా చూశారు. పల్లెల్లో చిన్నపాటి ఇళ్లు ఉన్నా, కొవిడ్ సోకిన వ్యక్తులను ఆరు బయట గదిలో ప్రత్యేకంగా ఉంచారు. హెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పల్లెల్లోని ప్రజలకు కూరగాయలు, నిత్యవసర సరకులు అందించారు. మహమ్మారి వ్యాప్తి చెందే తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సీఐ హనుక్, ఎస్సై మధుకర్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. పంచాయతీ సిబ్బంది నిత్యం ఈ పల్లెల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. బాధిత గ్రామాల్లోకి వెళ్లిన వైద్య సిబ్బంది అక్కడే పరీక్షలు నిర్వహించారు. వైరస్ సోకిన వారందరితో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఆరోగ్యం గురించి ఇతరత్రా ఇబ్బందుల గురించి నిత్యం ఉదయం, సాయంత్రం చరవాణిలో సంప్రదించేవారు. బీపీ, మధుమేహులతో పాటు ఇతర వ్యాధిగ్రస్థులకు అవసరమైన మందులు సైతం అందించారు. ఇలా కట్టుదిట్టంగా వ్యవహరించడంతో ఒక్క మరణం సంభవించకుండా అయిదు గ్రామాల్లోని 405 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం వారంతా సాధారణ స్థితికి వచ్చేశారు.
ఎవరూ బయటకు రాలేదు
గ్రామంలో 89 మందికి కరోనా సోకింది. వైద్యులు, పోలీసుల సూచనల మేరకు అందరూ ప్రత్యేకంగా మరో గదిలో ఉన్నాం. నిత్యం పండ్లు, ఆహారం తీసుకునేవాన్ని. గ్రామం నుంచి ఒక్క వ్యక్తి బయటకు వెళ్లలేదు. అందరం ఆరోగ్యంగా ఉన్నాం.
- రాఠోడ్ వితేష్, మోతీపటార్
గ్రామాల్లో వైద్య శిబిరాలు
కొత్తపల్లిలో కొవిడ్ వ్యాప్తి చెందుతోందని తెలిసిన వెంటనే ఆ గ్రామంతో పాటు మరో ఐదు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాం. ఆర్‌బీఎస్‌కే సిబ్బంది పరీక్షలు చేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు హోం ఐసొలేషన్ కిట్లు ఇవ్వడంతో పాటు, తగిన జాగ్రత్తలు చెప్పాం. నాకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నాతో పాటు అందరూ కోలుకోవడం సంతోషానిచ్చింది.- సంజీవ్, వైద్యాధికారి
ఇదీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 8,061 కరోనా కేసులు, 56 మంది మృతి