మరోసారి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బెల్ట్ షాపులన్నీ మనవే అని పేర్కొన్నారు. బెల్ట్ షాపుల్లో మద్యం అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారని జడ్పీటీసీ జగన్ తెలిపారు. బెల్టు షాపులకు మద్యం పోకుండా చూడాలని లేదంటే బెల్ట్ షాపులు బంద్ చేయించాలని డిమాండ్ చేశారు.
ఈ దశలో ఎమ్మెల్యే రాములు నాయక్ జోక్యం చేసుకుని.. బెల్ట్ షాపులన్నీ మనవే అంటూ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉక్కుపాదం చూపకుండా ఉండాలని అధికారులకు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు నివ్వెరపోయారు. అనంతరం ఎక్సైజ్ శాఖ సీఐని క్యాంపు కార్యాలయంలో కలవాలని రాములు నాయక్ సూచించారు.
గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రాములు నాయక్ డబ్బులు కూడా ఇస్తామని వ్యాఖ్యలు చేయడం అప్పడు వైరల్గా మారాయి. కార్యక్రమంలో ఎంపీపీ శకుంతల, తహసీల్దార్ పుల్లయ్య, ఎంపీడీవో రమాదేవి, ఎక్సైజ్ శాఖ ఎస్సై వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : దాడులతో భాజపా ఎదుగుదలను అడ్డుకోలేరు: అర్వింద్