Vanajeevi Ramaiah: ఏడుపదుల వయసులోనూ మొక్కల నాటే యజ్ఞాన్ని కొనసాగిస్తూ.. అటవీ సంరక్షణనే తన ఇంటిపేరుగా మార్చుకుని వనజీవిగా గుర్తింపు పొందిన ప్రకృతి ప్రేమికుడు రామయ్య. ప్రకృతి ఇచ్చిన సంపదతో మళ్లీ వనవృద్ధికే వినియోగించాలనే ఆలోచనతో.. మరోసారి పర్యావరణంపై తన ప్రేమను చాటుకున్నారు. జీవితం మొత్తం చెట్ల సంరక్షణ, మొక్కల పెంపకమే తన జీవిత ధ్యేయంగా సాగుతున్న వనజీవి రామయ్య.. తన సొంత వ్యవసాయ క్షేత్రంలో తాను ఏళ్లుగా శ్రమించి పెంచి పెద్ద చేసిన అత్యంత విలువైన ఎర్రచందనం చెట్లను ఉచితంగా ప్రభుత్వానికి అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న సుమారు 20 టన్నుల ఎర్రచందనం దుంగలను ఉచితంగా ప్రభుత్వానికి అందిస్తానని వనజీవి ప్రకటించారు. దుంగలు విక్రయిస్తే వచ్చే సొమ్మును హరితనిధికి కేటాయించాలని ప్రకటించారు. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్‌లో తెరాస రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌ను కలిసిన వనజీవి రామయ్య దంపతులు.. తమ నిర్ణయాన్ని ఎంపీకి తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ అటవీశాఖ ఉన్నతాధికారులకు తెలపగా.. అక్కడి నుంచి జిల్లా అటవీ అధికారులకు సమాచారం చేరింది.
అదే నా ఉద్దేశం..
బయట ఒకరు టన్నుకు 3లక్షలు ఇస్తామన్నారు. కానీ నేను ఇవ్వను అని చెప్పాను. అన్నం ఫౌండేషన్ పొయ్యిలో పెట్టడానికైనా ఇస్తాను కానీ అమ్మనని చెప్పాను. సీఎం కేసీఆర్ హరితనిధి ప్రకటిస్తే వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా. డబ్బులు ఇవ్వలేను కావున ఎర్రచందనం దుంగలను ఇస్తున్నా. చెట్లను అమ్మగా వచ్చిన డబ్బులు మళ్లీ చెట్ల కోసమే వినియోగించాలనేదే నా ఉద్దేశం.
-పద్మశ్రీ వనజీవి రామయ్య, ప్రకృతి ప్రేమికుడు
గొప్ప మనసును చాటుకున్న వనజీవి
రాష్ట్ర అటవీ శాఖ అధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా అటవీశాఖ బృందం.. ఖమ్మం గ్రామీణం మండలం పల్లెగూడెంలో ఉన్న వనజీవి రామయ్య వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఎర్రచందనం చెట్లు, దుంగలను పరిశీలించి కొలతలు వేశారు. కొన్నేళ్ల క్రితం తన వ్యవసాయ క్షేత్రంలో ఎర్రచందనం చెట్లు పెంచేందుకు అనుమతి తీసుకుని వాటిని సంరక్షించారు. ఎర్రచందనం చెట్లన్నీ భారీగా పెరిగాయి. ఇటీవల కొన్ని చెట్లను నరికించేశారు. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. వీటి విలువ మార్కెట్లో భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దుంగలు విక్రయిస్తే వచ్చిన సొమ్మంతా ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితనిధికి అప్పగించనున్నట్లు వనజీవి ప్రకటించారు. పదేళ్ల ప్రాయం నుంచే మొక్కలు పెంచే యజ్ఞానికి శ్రీకారం చుట్టిన రామయ్య..ఇప్పటికే కోట్లాది మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్నారు. తాజాగా అత్యంత విలువైన ఎర్రచందనం కలపను ప్రభుత్వానికి ఉచితంగా అందించి వనజీవి రామయ్య మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.
ప్రశంసల జల్లు
ఎర్రచందనం చెట్లను నరికిన తర్వాత దుంగలను శంషాబాద్‌లోని అటవీశాఖ డిపోకు తరలించనున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వన సంరక్షణలో తనదైన ముద్రవేస్తూ.. దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు సొంతం చేసుకున్న వనజీవి రామయ్య.. ఏమాత్రం స్వార్థం లేకుండా అత్యంత విలువైన ఎర్రచందనం దుంగలను ఉచితంగా ప్రభుత్వ హరిత నిధికి ఇవ్వడంపై ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇదీ చదవండి: