UP migrant worker need help in khammam: బతుకుదెరువు కోసం 28 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేవర్య జిల్లా భట్ని గ్రామానికి చెందిన అవదేశ్ యాదవ్ తన భార్య శైలోజ్‌తో కలిసి ఖమ్మం నగరానికి వచ్చారు. పానీపూరి బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. తదనంతరం నలుగురు పిల్లలు పుట్టారు. కొన్ని రోజుల తర్వాత అవదేశ్ యాదవ్ రెండు మూత్రపిండాలు చెడిపోయాయి.
కుటుంబ పెద్ద దిక్కు అనారోగ్యంతో మంచాన పడటంతో అతడి భార్య, నలుగురు పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. వారానికి మూడుసార్లు అవదేశ్ యాదవ్ డయాలసిస్ చేయించుకుంటూ రోజులు గడుపుతున్నాడు. ఔషధాలకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. సమయానికి స్కూల్ ఫీజులు కట్టలేక అతడి పిల్లలు చదువులకు దూరమవుతున్నారు.
ఖమ్మం నగరం ఖానాపురం శివారులో ఆయన బంధువుల ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. 8నెలల క్రితం వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇంత కాలం స్నేహితులు..బంధువులు ఆర్థిక సాయంతో నెట్టుకొచ్చాడు. ఇప్పటికే 3 లక్షల వరకు అప్పు అయ్యింది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు పిల్లలను ఆయన ప్రైవేటు పాఠశాలలో చదివించాడు.
ఇప్పడు ఫీజు కట్టలేని పరిస్థితి. ఇటీవల హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొని మూత్రపిండాల మార్పిడికి జీవనధారలో అవకాశం కల్పించాలని వేడుకున్నారు. మూత్రపిండాల మార్పిడికి అవకాశం వచ్చినా సుమారు మూడు, నాలుగేళ్లు సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. అవదేశ్ పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుండటంతో భార్యా పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భర్తను వదిలి ఏదైనా పనికీ వెళ్లలేపోతున్నానని శైలోజ్ చెబుతున్నారు. దాతలు స్పందించి తమకు ఆర్థిక సాయమందించాలని కోరుతున్నారు.
బతుకుదెరువుకు మన రాష్ట్రం వచ్చి..అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటున్న అవదేశ్ యాదవ్ కుటుంబం ఉన్నదంతా చికిత్సకు ఖర్చు చేశారు. తదుపరి వైద్యఖర్చులకు ఎవరైనా దాతలు సాయం కోసం ఎదురు చేస్తున్నారు.
"డాక్టర్ రెండు కిడ్నీలు చెడిపోయాయి వెంటనే వాటిని మార్చుకోవాలని చెప్పారు. మూత్రపిండాల మార్పిడికి పదిహేను లక్షల రూపాయాల వరకు ఖర్చు అవుతుందన్నారు. చికిత్స చేయించుకోవడానికి డబ్బు లేదు. ఎవరైనా ఆర్థిక సహాయం చేయగలరు." - అవదేశ్ యాదవ్, బాధితుడు
"మా నాన్న మమ్మల్ని పానీపూరీ బండి నడిపిస్తూ పోషించేవారు. ఆయనకి రెండు కిడ్నీలు చెడిపోయాయి. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయిస్తున్నాం. కిడ్నీ మార్పిడి చేయడానికి ఆర్థిక స్తోమత మాకు లేదు. దాతలు ఎవరైనా ఆర్థిక సహాయం చేయగలరు".- ఖుషీ, అవదేశ్ యాదవ్ పెద్ద కూతురు
ఇవీ చదవండి: