Tummala Nageswara Rao To Join Congress : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్‌లో చేరే దిశగా వేగంగా (Tummala Nageswara Rao To Join Congress) అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని తుమ్మల నివాసానికి వెళ్లి.. ఆయనను హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే శనివారం తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం చేరుకున్న విషయం తెలుసుకుని.. ఆయన నివాసానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam Politics) నలుమూలల నుంచి పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
Tummala To Join Congress : ఉదయం నుంచే తుమ్మల నాగేశ్వరరావు.. నివాసం వద్ద సందడి నెలకొంది. వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన నేతలు,కార్యకర్తలు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. పాలేరు నియోజకవర్గ ముఖ్య నాయకులతో.. ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తామంతా మీ వెంటే కలిసి నడుస్తామని తుమ్మలకు.. వారు స్పష్టం చేశారు.
మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు నివాసం వద్ద.. తుమ్మలన్న రా..కదిలిరా..జనమంతా ప్రభంజనంలా నీ వెంటే అంటూ వెలిసిన ఫ్లెక్సీ ఆకట్టుకుంది. తుమ్మల హస్తం గూటికి చేరడం ఖాయమవడం.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనతో పాటు ముఖ్య నేతలెవరు.. కాంగ్రెస్‌లోకి వెళ్తారనే చర్చ జోరుగా సాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న పలువురు జిల్లా నాయకులు.. తుమ్మలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల నుంచి నాయకులు.. తుమ్మల నాగేశ్వరరావు పాటే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఖమ్మంలో శనివారం మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-ఛైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. తుమ్మల నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి నేతలు తరలివస్తున్న సమయంలోనే.. పొంగులేటి వస్తున్నారని తెలియడంతో హడావిడి నెలకొంది.
Ponguleti Meets Tummala in Khammam : కాసేపటి తర్వాత తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు (Ponguleti Meets Tummala in Khammam) ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తర్వాత ఇరువురు 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. భేటీ అనంతరం పొంగులేటి మాట్లాడారు. తుమ్మలను సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తుమ్మల నాగేశ్వరరావు నుంచి త్వరలోనే సానుకూల ప్రకటన వస్తుందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
"సీతారామ ప్రాజెక్టులోకి గోదావరి జలాలను విడుదల చేయడం నా రాజకీయ జీవిత లక్ష్యం. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను. ప్రజల సహకారంతో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేశాను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు." - తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ అసంతృప్త నేత
Ponguleti Meets Tummala : తుమ్మలతో పొంగులేటి భేటీ.. మాజీ మంత్రి నిర్ణయంపై అనుచరుల్లో ఉత్కంఠ
తన చిరకాల మిత్రుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలోకి తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతునట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి.. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు తేవడమే తన రాజకీయ లక్ష్యమన్నారు. ఈ లక్ష్యం కోసమే ప్రజల ఆకాంక్ష మేరకు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. అందరితో మాట్లాడిన తర్వాత తదుపరి రాజకీయ నిర్ణయం ఉంటుందని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
"బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఇష్టం లేకపోతే పంపించే కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలా కాకుండా పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుగా.. నన్ను, ఇప్పుడు తుమ్మలను పార్టీ నుంచి పంపించేశారు. ఆ పార్టీలో కొన్ని శక్తులు యుక్తులు పన్ని ఇలాంటి పనులను చేస్తున్నాయి. ఆయననే తనను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్లారు. తుమ్మలను, వారి కార్యకర్తలను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానిస్తున్నాము." - పొంగులేటి, కాంగ్రెస్ నేత
మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖాయమవడంతో.. ఆయనతోపాటు వెళ్లే నేతలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా.. అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించేందుకు జిల్లా ముఖ్యనాయకులను రంగంలోకి దింపింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.