రైతుల ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి మూడు సాగు వ్యతిరేక చట్టాలను రద్దు (Centre to Repeal Of 3 Farm Laws) చేసిందని తెరాస లోకసభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు (TRS MP Nama Nageswara Rao) పేర్కొన్నారు. సాగు చట్టాల రద్దుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై నామ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చట్టాలు రైతుల మేలు కోసం కాదని తాము పార్లమెంట్ లోపల, బయట గొంతెత్తి అరిచినా అప్పుడు కేంద్రం వినిపించుకోలేదని గుర్తు చేశారు. ఈ చట్టాలు లోకసభ, రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు తాము ఎన్నో పోరాటాలు చేసినట్టు నామ (TRS MP Nama Nageswara Rao) వెల్లడించారు.
ఎన్నికలు జరుగుతుంన్నందునే...
దేశ సరిహద్దుల్లో జవాన్ కావాలి కాస్తుంటే మరో పక్క రైతులు దేశ ప్రజలకు కడుపు నింపుతున్నారని నామ (TRS MP Nama Nageswara Rao) అన్నారు. అటువంటి రైతన్నకే కష్టాలు వచ్చాయని పది రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించామని తెలిపారు. అప్పుడు కేంద్రం తమ అభ్యర్థనను పట్టించుకోలేదని చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రభావం పడకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికల కోసం కాకుండా భేషరతుగా చట్టాలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసిఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని, వారి కోసం నిరంతరం పోరాటం కొనసాగుతుందని నామ పేర్కొన్నారు.
తెలంగాణ ధాన్యం కూడా కొనుగోలు చేయాలి
దక్షిణాదిలో ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమైన తెలంగాణలో వడ్ల కొనుగోలు కోసం తాము పోరాడుతున్నామని... కేంద్రం కొనుగోలు చేయాలని ఎంపీ నామ డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తారని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసి.. ఇప్పుడెందుకు కొనుగోలు చేయరని ఆయన నిలదీశారు. యాసంగిలో వడ్లు ఎందుకు కొనుగోలు చేయరో రైతులకు సమాధానం చెప్పాలని అన్నారు. వడ్లు కొనే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పంట సేకరణలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఒక విధానం... పంజాబ్లో మరో విధానాన్ని అవలంభిస్తోందని ఎంపీ నామ నాగేశ్వరరావు మండిపడ్డారు.
నిజంగా ప్రేమ ఉంటే..
తెలంగాణలో వ్యవసాయానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, వారికి అన్యాయం చేయాలని చూస్తే సహించేదిలేదని నామ స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ప్రస్తుతం రాష్ట్రంలో వరి ఎక్కువగా పండిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు నీళ్లున్నా వరి వేసుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం రైతులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ భాజపా నేతలకు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనేందుకు ఒప్పించాలని హితవు పలికారు. లేకుంటే రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి : కొత్త సాగు చట్టాల రద్దు.. రైతులకు మోదీ క్షమాపణలు