ఖమ్మంలో జరిగిన అభివద్ధిని ఓటర్లకు వివరించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభ్యర్థులకు సూచించారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల వేళ తెరాస అభ్యర్థులకు ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో అభ్యర్థులు, డివిజన్ల బాధ్యులు, ఇంఛార్జ్‌లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల హాజరయ్యారు. ఎన్నికల ప్రచారానికి కేవలం మూడ్రోజులే మిగిలి ఉన్నందున నగర అభివృద్ధి కోసం ఎక్కువ మంది ఓటర్లను కలవాలని సూచించారు. నగరంలోని ప్రతీ ఇంటికీ ప్రభుత్వ పథకాల రూపంలో లబ్ధి జరిగిందని మంత్రి అన్నారు.
ఖమ్మంను అభివృద్ధికి గుమ్మంలా మార్చిన ఘనత తెరాసదేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలను ఓ తంతుగా భావిస్తున్నాయని.. తెరాసకు మాత్రం ఈ ఎన్నికలు ఓ బాధ్యత అని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఒక్క తెరాసకే ఉందన్నారు.
ఖమ్మం ఎన్నికల్లో తెరాసను గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని మాజీ మంత్రి తుమ్మల... అభ్యర్థులకు సూచించారు. నగరంలో జరుగుతున్న ఎన్నికలు ఏకపక్షమేనని..కాంగ్రెస్, తెదేపా, తెరాస పాలనలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూస్తే..ఎవరేం చేశారన్నది ప్రజలు నిర్ణయిస్తారన్నారు.