ఖమ్మం జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలు ఖమ్మం నగరం వైపు తొంగి చూసేలా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని తెలిపారు. నగరంలో పర్యాటక రంగానికి ఊపు తేచ్చేలా...పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్‌పై వాకర్స్ ప్యారడైజ్ నిర్మించి ఏడాది పూర్తయిన సందర్భంగా నగరంలో మంత్రి పువ్వాడ పర్యటించారు.
జడ్పీ ఛైర్మన్ కమల్ రాజు, ఎమ్మెల్సీ బాలసాని, మేయర్ నీరజతో కలిసి వాకర్స్ ప్యారడైజ్‌లో వాకింగ్ చేశారు. నగరవాసులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. వాకర్స్ ప్యారడైజ్ నగరవాసులకు చక్కటి ఆహ్లాదాన్ని పంచడంతోపాటు పచ్చదనం మధ్య ఉదయం, సాయంత్రం నడకలకు ఉపయోగపడుతుందని మంత్రి పువ్వాడ తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సరికొత్త హంగులతో వాకర్స్ ప్యారడైజ్ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
లకారం ట్యాంక్ బండ్ వద్ద ఎప్పుడు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. శనివారం, ఆదివారమని తేడా లేకుండా ప్రతి రోజు నగర ప్రజలు సేదతీరడానికి లకారం ట్యాంక్ బండ్‌కు వస్తున్నారు. నగర ప్రజలకు మరింత వినోదం కోసం సస్పెన్షన్ బ్రిడ్జిని దీపావళి నాటికి పూర్తి చేయాలనుకుంటున్నాము. దానితోపాటుగా ఇతర అభివృద్ది పనులను చేపట్టి నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేస్తాం. -పువ్వాడ అజయ్, రవాణా శాఖ మంత్రి
ఇదీ చదవండి: నా రాజీనామా వెనుక లోతైన అర్థం ఉంది: ప్రకాశ్‌రాజ్