లాక్డౌన్... ఈ మధ్య ఎక్కడ చూసినా... ఏం చేసినా వినిపించే మొదటి పదం. దీని వల్ల పేదల ఆకలి కేకలు మరింత విస్తృతమయ్యాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తమకు కావాల్సిన ఆహార పదార్థాలను స్వతహాగా తయారుచేసుకోగల మనుషులే ఇంతటి విపత్కర స్థితిలో ఉంటే... స్వయం ఉత్పత్తి చేసుకోలేని మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే హృదయం బరువెక్కిపోతుంది. వాటికి ఆహారం లభించే మార్గాలు చాలా వరకు మూసుకుపోయాయి. ఈ క్రమంలో వానరాలు ఆకలితో అలమటిస్తూ, తాగునీరు దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. ప్రజలకు... ప్రభుత్వాలు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తుండగా... అడవుల్లోని కోతులు మాత్రం పస్తులుంటున్నాయి. వాటి దీన స్థితిని చూసి చలించిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి యువకులు రాధాకృష్ణ, నరేష్, చిరంజీవి, ప్రశాంత్... వారంరోజులుగా వాటికి ఆహారం అందిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఇంటి వద్ద తయారుచేసిన ఆహారంతోపాటు జామకాయలు, అరటి పండ్లు, జీడీకాయలు, తాగునీటిని ఆటోలో తీసుకెళ్లి... చెరుకుపల్లి అడవుల్లోని కోతులకు అందిస్తున్నారు. మూగజీవాలపై వీరు చూపిస్తున్న ఉదారత నిజంగా అభినందనీయం.
ఇవీ చూడండి : తడిసిన ధాన్యం రాశులు... తల్లడిల్లిన అన్నదాతలు