chandrababu comments on Telangana: ఖమ్మంలో టీడీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయల్దేరారు. పార్టీకి పూర్వవైభవంతోపాటు శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడమే లక్ష్యంగా తెలుగుదేశం శంఖారావం పేరుతో.. ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తుంది. ఈ సభలో పాల్గొనేందుకు పార్టీ అధినేత చంద్రబాబు.. హైదరాబాద్ నుంచి బయల్దేరారు. శ్రేణులతో కలిసి ఖమ్మం బయల్దేరిన ఆయన మార్గమధ్యలో చంద్రబాబుకు నేతలు ఘనస్వాగతం పలికారు. వనస్థలిపురంలో గజమాలతో టీడీపీ శ్రేణలు సత్కరించారు.
కూసుమంచి మండలం కేశవాపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి మాట్లాడారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తెదేపానే అని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాను కూడా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఐటీ స్థాపించామని చెప్పారు. అప్పట్లో సెల్‌ఫోన్ బువ్వ పెడుతుందా అని ఎగతాళి చేశారని.. ఇప్పుడు సెల్‌ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదని తెలిపారు.
ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టారు. ఎన్టీఆర్ విగ్రహం ముందు తీసుకున్న ఏ సంకల్పమైనా నెరవేరుతుంది. టీడీపీ స్థాపించి 40 ఏళ్లు కావొస్తుంది. తెలుగు వాళ్ల అభివృద్ధి కోసమే తెదేపా పనిచేస్తుంది. తెలంగాణ అయినా, ఏపీ అయినా.. తెలుగువారి అభివృద్ధి కోసం పనిచేస్తాం. - టీడీపీ అధినేత చంద్రబాబు
తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో ఖమ్మం నగరమంతా జెండాలు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలతో పసుపుమయంగా మారింది. ఉమ్మడి ఖమ్మం సహా రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలను పసుపు చీరలు ధరించి సభలో పాల్గొనేలా సన్నాహాలు చేశారు.
ఇవీ చదవండి: