కొనుగోళ్లపై జీఎస్‌టీ చెల్లించాలని.. అధికారులు నోటీసులు జారీ చేయడం.. ఖమ్మంలో పత్తి వ్యాపారుల సమ్మెకు దారితీసింది. జీఎస్టీఅమల్లోకి రాక ముందు.. పత్తి వ్యాపారులు 5 శాతం వ్యాట్, 2శాతం సీఎస్‌టీ చెల్లించారు. 2017 జులై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి 2017 అక్టోబరు వరకు అన్ని రకాల పంట ఉత్పత్తులపై ఒకే రకమైన అమ్మకం పన్ను ఉంది. 2017 నవంబర్ 15న కేవలం పత్తి ఖరీదుపైన 5 శాతం జీఎస్టీ విధించారు.
పత్తిని ప్రత్యేకంగా రివర్స్ ఛార్జీ మెకానిజమ్‌లోకి తెచ్చారు. పక్షం వ్యవధిలో మారిన జీవో గురించి వ్యాపారులకు సరైన సమాచారం లేదు. ఆ జీవోలో కొనుగోళ్లపై జీఎస్టీ చెల్లించాలనే నిబంధన ఉంది. కానీ వ్యాపారులు పాత విధానంలోనే అమ్మకంపై పన్ను చెల్లించారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి ఎలాంటి నష్టం జరగలేదని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. కానీ సరైన విధానంలో చెల్లించక పోవడం వల్ల తిరిగి చెల్లించాలని అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఒక్క ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోనే.. 30 మంది పత్తి వ్యాపారులు రూ.30 కోట్ల చెల్లింపులు చేయాలని నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని మిగతా అన్ని ప్రాంతాల్లో సుమారు 100 మంది పత్తి ఖరీదుదారులు రూ.60 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయం తేలేవరకు పత్తి కొనుగోళ్లు చేయబోమంటూ.. వ్యాపారులు తేల్చిచెబుతున్నారు. పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో.. మార్కెట్‌కు సెలవులు ప్రకటించిన మార్కెట్ అధికారులు వ్యాపార వర్గాలతో చర్చలు జరుపుతున్నారు.
రైతులు నష్టపోకుండా చూడాలంటూ వ్యాపారులకు నచ్చజెప్పుతున్నారు. ఈ చర్చలకు వ్యాపారులు ఒప్పుకోవడం లేదు. రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లకు సహకరించాలని అధికారులు చెప్పినా తమ సమస్యపై అధికారుల నుంచి హామీ రాకపోవడంతో వ్యాపారులు నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించారు. తిరిగి ప్రకటించే వరకు విపణికి సరకు తీసుకురావద్దని.. అధికారులు కోరుతున్నారు.
మార్కెట్‌ను వెంటనే తెరవాలని.. రైతుల తెచ్చిన సరుకును కొనేలా పాలకవర్గం.. అధికారులు చర్యలు తీసుకుకోవాలని రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గోకినేపల్లి వెంకటేశ్వర్లు, ఏఐకేఎంఎస్ నాయకులు అధికారుల నోటీసుల నేపథ్యంలో.. వ్యాపారులు బంద్ ప్రకటించడం పట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ప్రైవేటు వ్యాపారులకు అయినకాడికి అమ్ముకుని నష్టపోతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: