కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయినా.. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను మాత్రం ఆపలేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పరితపించే ఏకైక పార్టీ.. తెరాస అని అన్నారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఖమ్మం నియోజకవర్గంలోని 207 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశారు మంత్రి. నియోజకవర్గంలో ఇప్పటివరకూ 4713 మందికి చెక్కులు అందాయని గుర్తుచేశారు.
తెరాస పార్టీ తెలంగాణకు శ్రీరామరక్ష అని పువ్వాడ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శం'