చెక్ పవర్ విషయమై.. గ్రామ పంచాయతీకి చెందిన ప్రజాప్రతినిధులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన జరిపిన ఘటన ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్.. ఉపసర్పంచ్ మణికొండ నాగేశ్వరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. నిధుల దుర్వినియోగం విషయంలో గత నెల సర్పంచ్ ఆదెర్ల స్రవంతి సస్పెండ్‌కు గురయ్యారు. ఆమె స్థానంలో, చెక్ పవర్ కోసం ఉపసర్పంచ్.. తనకు మద్దతుగా నిలిచిన వార్డు సభ్యులతో కలసి సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ క్రమంలో గ్రామ సర్పంచ్ స్రవంతి తమకు అనుకూలంగా.. కోర్టు స్టే ఇచ్చిందంటూ మిగతా ప్రజాప్రతినిధులతో కలిసి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. కోర్టు తీర్పు వెలువడక ముందే.. ఇప్పటికిప్పుడు చెక్ పవర్ అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు. సమావేశాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్.. ఉపసర్పంచ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఆందోళనలో ఎంపీటీసీ ఇమ్మడి రమాదేవి, మండల కోఆప్షన్ ఎండీ హనీఫ్, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. కుమారుడే కారణమా?