సింగరేణి విస్తరణ కోసం 50 ఎకరాల వారసత్వ భూములు కోల్పోయామని ఓ రైతు కుటుంబం రోడ్డుకెక్కింది. పరిహారంతోపాటు జీవనాధారం కల్పిస్తామన్న సంస్థ... ఇప్పుడు పట్టించుకోవట్లేదని ఆందోళన చేపట్టింది. తమకు న్యాయం చేయాలంటూ... అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని రైతు సుందర్‌లాల్ లోథ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'మా ముత్తాతల కాలం నాటి భూమి. 50 ఎకరాల భూమిని సింగరేణి విస్తరణ పనుల కోసం ఇచ్చాం. 150 ఏళ్ల నుంచి సాగు చేసిన భూమిని సింగరేణి ఇచ్చాం. బొగ్గు గనుల కోసం మేము ఆ భూమిని ఇచ్చాం. అందుకు ప్రతిఫలంగా మాకు పరిహారం ఇస్తాం అన్నారు. అంతేకాకుండా ఉద్యోగం ఇస్తామన్నారు. వీలైయితే వేరేచోట భూమినీ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు దీనిపై అధికారులు స్పందించడం లేదు.'
- సుందర్‌లాల్ లోథ్, బాధిత రైతు
న్యాయం చేయాలంటూ ఎడ్లబండి యాత్ర చేపట్టి నిరసన తెలుపుతున్నారు ఆ రైతు కుటుంబ సభ్యులు. ఇల్లెందు నుంచి ఖమ్మం కలెక్టరేట్‌కు ఎడ్లబండిపై వచ్చిన రైతు సుందర్ లాల్‌లోథ్... తన గోడును ఈటీవీ భారత్‌తో వెల్లబోసుకున్నారు.
'నేను పెళ్లి చేసుకోని వచ్చినప్పటి నుంచి ఆ భూమి కోసం మా అత్తామామలు పోరాడుతున్నారు. ఎన్నో రోజులుగా కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మా గోడును ఎవరూ వినడం లేదు. చేసేది లేక ఎడ్ల బండి కట్టుకొని వచ్చాం. ఏళ్లుగా ఓ రైతు తిరుగుతున్నా ఒక్క అధికారి అయినా పట్టించుకోవడం లేదు. మా ఆయన ఆత్మహత్య చేసుకుందాం అంటున్నారు. మాకు ఉండడానికి ఇల్లు లేదు. ఎంతోమంది అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకు న్యాయం చేయలేదు. ఆ భూమికి సంబంధించిన అన్ని హక్కు పత్రాలు మా దగ్గర ఉన్నాయి. మా పొలం పక్కన ఉన్నవాళ్లు అందుకు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా సింగరేణి అధికారులు మాకు పరిహారం చెల్లించడం లేదు. ఇప్పటికైనా న్యాయం చేయాలని వేడుకుంటున్నాం.
- రైతు భార్య
ఇదీ చదవండి: TERRORISTS: ఉగ్రవాదులకు నివాసంగా మారుతున్న మహానగరం..!