Singareni profit Increase: కరోనా పరిస్థితులను అధిగమించి... ఈ ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో సింగరేణి అద్భుతమైన వృద్ధితో దూసుకుపోతోందని యాజమాన్యం ప్రకటించింది. సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 8 నెలల్లో.... రూ. 16,512 కోట్ల అమ్మకాలను జరిపినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 10,127 కోట్ల అమ్మకాల కంటే.. ఇది 63 శాతం అధికమని సంస్థ పేర్కొంది. 8నెలల్లో కంపెనీ రూ. 924.4 కోట్ల లాభాలను ఆర్జించినట్లు సింగరేణి యాజమాన్యం పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో సింగరేణి సంస్థ కరోనా పరిస్థితుల నేపథ్యంలో రూ 1,038 కోట్ల నష్టాలను చవిచూసింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది కంటే 189 శాతం వృద్ధితో రూ. 924.4 కోట్ల లాభాలు గడించిందని సంస్థ వెల్లడించింది.
కొవిడ్ నివారణ ఫలితం...
సింగరేణి గత ఏడాది కరోనా పరిస్థితులు, గనుల లాక్ డౌన్ తదితర సమస్యల కారణంగా రూ. 7,979 కోట్ల బొగ్గు అమ్మకాలను మాత్రమే జరిపింది. సింగరేణి యాజమాన్యం రూ. 73 కోట్ల వ్యయంతో పెద్దఎత్తున తీసుకున్న కరోనా నివారణ చర్యల ఫలితంగా కరోనా తగ్గుముఖం పట్టి ఈ ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని యాజమాన్యం పేర్కొంది. దీంతో ఈ ఏడాది గడచిన 8 నెలల్లో రూ. 13,973 కోట్ల బొగ్గు అమ్మకాలు జరిపి... గత ఏడాది ఇదే కాలానికి జరిపిన అమ్మకాల కన్నా 75 శాతం వృద్ధి నమోదు చేసింది. విద్యుత్ అమ్మకాల్లో సైతం 18 శాతం వృద్ధిని నమోదు చేసిందని పేర్కొంది. గత ఏడాది తొలి 8 నెలల కాలంలో రూ. 2,149 కోట్ల విద్యుత్ అమ్మకాలు జరిపిన కంపెనీ... ఈ ఏడాది తొలి 8 నెలల్లో 18 శాతం వృద్ధితో రూ. 2,539 కోట్ల విలువైన విద్యుత్ అమ్మకాలు జరిపింది.
ఇతర ప్రభుత్వ సంస్థల కంటే...
టర్నోవర్, లాభాల్లో.. ఇతర ప్రభుత్వ సంస్థల కంటే సింగరేణి మెరుగైన వృద్ధిని నమోదు చేసిందని యాజమాన్యం పేర్కొంది. తొలి అర్ధ సంవత్సరంలో కోలిండియా తన అమ్మకాల్లో 23 శాతం వృద్ధిని నమోదు చేయగా సింగరేణి 67 శాతం వృద్ధిని నమోదు చేసిందని సంస్థ తెలిపింది.
ఇదీ చదవండి: Coal Mining Tenders: బొగ్గు గనుల వేలానికి దూరంగా సింగరేణి ...
Huge Loss to Singareni : సింగరేణికి సమ్మె నష్టం రూ.120 కోట్లపైనే!