ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలో ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు... దేశంలోనే ఎక్కడా లేని విధంగా 25 కిలోల బియ్యం, 2 వేల రూపాయల నగదు అందిస్తున్నామని సండ్ర అన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం సమర్థవంతంగా జరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, గ్యాస్ డీలర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశామని పేర్కొన్నారు. త్వరలోనే సెలూన్లలో పనిచేస్తున్న వారికి, లారీ డ్రైవర్లకు టీకాలు ఇస్తామన్నారు. ప్రజలు తప్పకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు రావొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మహేష్, పీఏసీఎస్ అధ్యక్షుడు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'