ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. సంస్థకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో చిక్కుకున్న తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన అతని కుమారుడికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరెడ్డికి 80శాతానికిపైగా కాలిన గాయాలయ్యాయని, హైదరాబాద్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ఆ సమయంలో అక్కడే ఆగివున్న మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కార్మికులను చెదరగొట్టారు. కార్మికులకు మద్దతుగా సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ నేతలు, మాజీ ఎమ్మెల్యే సాంబశివరావు ఆందోళనలో పాల్గొన్నారు. ఓవైపు కార్మికుల ఆందోళన కొనసాగుతుండగానే .. మరో ఆర్టీసీ కార్మికుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కార్మికులు అప్రమత్తమై అడ్డుకున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు బంద్‌కు పిలుపు
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం ఘటన దృష్ట్యా ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ పాటించాలని ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది. జిల్లాలోని ఆరుడిపోల పరిధిలో అన్ని రకాల బస్సులు నిలిపివేయాలని ఐకాస నేతలు ప్రకటించారు.
ఇవీ చూడండి: 'సమ్మెలో పాల్గొన్న వారిని తిరిగి తీసుకోవద్దు'