Pregnant Lady Died Due To Negligence Of doctors: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఖమ్మం మతా శిశు సంరక్షణ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యలు సాధారణ ప్రసవానికి ప్రయత్నించి తర్వాత రెండు సార్లు శస్త్ర చికిత్స చేయడం వల్లనే బాలింత మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతాను గూడెంకు చెందిన మమత (21) నెలలు నిండటంతో కాన్పు కోసం అక్టోబర్ 1న ఖమ్మం ఎంసిహెచ్‌లో చేరింది. మొదట సాధారణ కాన్పుకు ప్రయత్నించిన వైద్యలు చిన్న ఆపరేషన్ చేశారు. సాధ్యం కాకపోవడంతో ఆక్టోబర్ 2న పెద్ద ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు.
శస్త్ర చికిత్స సమయంలో కుట్లు సరిగా వేయకపోవడంతో అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించారు. రాత్రి ఒకేసారి ఫీట్స్ రావడంతో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె మృతి చెందింది. దీనితో ఆగ్రహానికి గురైన బంధువులు ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం వల్లే మమత మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. వైద్యులు వారితో చర్చలు జరిపి శాంతింపజేశారు. బాలింతకు కాన్పు తర్వాత ఫీట్స్ రావడంతోనే ఆమె మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి శిశువుకు ఎంసిహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇవీ చదవండి: