Political Heat in Khammam District : అసెంబ్లీ ఎన్నికల కార్యక్షేత్రంలో బీఆర్ఎస్ ముందు వరుసలో నిలిచింది. ఆగస్టు 21న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా.. ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజా క్షేత్రంలోకి దూకారు. ప్రత్యర్థులెవరో తేలకముందే నియోజకవర్గాల్లో ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇటీవలే జిల్లాలో పర్యటించి ఎన్నికల శంఖారావం పూరించారు. ఖమ్మం, సత్తుపల్లి బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఎన్నికలకు కార్యోన్ముఖుల్ని చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఖమ్మం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆత్మీయ సమ్మేళనాల పేరిట విస్తృతంగా ప్రజలను కలిసి మళ్లీ గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
ఈ నెల 15న పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీ-ఫారాలు అందజేసిన తర్వత ఎన్నికల ప్రచారాన్ని గులాబీ పార్టీ మరింత ముమ్మరం చేయనుంది. ఈనెల 27న పాలేరులో బహిరంగ సభ ద్వారా.. జిల్లాలో ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టనున్న కేసీఆర్.. వచ్చే నెల 1న సత్తుపల్లి, ఇల్లందు, 4న కొత్తగూడెం, ఖమ్మం బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
Congress Candidate Selection From Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గెలుపు గుర్రాల కోసం నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా చేస్తున్న కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమతోంది. ఇప్పటికే మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మిగిలిన 8 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు దాదాపు 130 మంది ఆశావహ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సర్వేలు, ప్రజాదరణ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక ఉంటుందని.. త్వరలోనే పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ ముఖ్యనాయకుడొకరు ఈటీవీ భారత్‌కు వెల్లడించారు. ఈసారైనా బోణీ కొట్టాలన్న లక్ష్యంతో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభతో కమల దళంలో కొత్త ఉత్సాహం నింపింది. నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ అన్వేషణ ఇంకా కొనసాగుతుంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు సై అంటున్న బహుజన సమాజ్ పార్టీ 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
Communist Party Political Activity in Khammam : కమ్యూనిస్టులకు బలమున్న జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధానమైంది. వామపక్ష పార్టీలకు రాష్ట్ర నాయకత్వం వహించే నాయకులంతా ఈ జిల్లాకు చెందిన వారే కావడంతో ఇక్కడ ఈసారి పట్టు నిలుపుకునేందుకు కమ్యూనిస్టులు ఉవ్విళ్లూరుతున్నారు. తమ్మినేని వీరభద్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉండగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు రాష్ట్ర పార్టీకి రథసారథిగా ఉన్నారు. వీరిద్దరు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వారు కావడంతో.. వచ్చే ఎన్నికలను కామ్రేడ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే.. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తాయా... లేక రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అన్నది తేలాల్సి ఉంది. పొత్తుల ప్రక్రియ కొలిక్కి వస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా స్థానాలు కోరే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పొత్తు కుదరని పక్షంలో తమకు బలమున్న స్థానాల్లో ఎన్నికల బరిలో నిలిచేలా కమ్యూనిస్టులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.