Political Heat in Khammam: శాసనస ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ... రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి... అడుగులు ఎటువైపు అనే చర్చ జోరందుకుంది. 2019లో సిట్టింగు ఎంపీగా ఉన్న పొంగులేటి... బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పటి నుంచి పార్టీకి, ఆయనకు మధ్య దూరం పెరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 3 జనరల్ అసెంబ్లీ స్థానాల్లో... ఏదో ఒక చోట నుంచి తాను పోటీ చేస్తానని శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించడం దుమారం రేపింది.
ఇంకో అడుగు ముందుకేసి... పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు పోటీ చేస్తారని చెప్పడం సంచలనంగా మారింది. ఇక కొత్త ఏడాది ప్రారంభం రోజున.. బీఆర్ఎస్లో తనకు దక్కుతున్న గౌరవంపై కార్యకర్తల వద్ద అసంతృప్తి వ్యక్తం చేయడం కలకలం రేపింది. పొంగులేటి వ్యాఖ్యల్ని తీవ్రంగా తీసుకున్న బీఆర్ఎస్ అధిష్ఠానం... ఆయన భద్రతను కుదించింది. ఈ పరిణామంతో నొచ్చుకున్న పొంగులేటి.. రాజకీయ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో తన బలం నిరూపించుకునేందుకు... నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 10న పినపాక నియోజకవర్గంలో... అనుచరులు, అభిమానులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారాన్ని... బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నేతలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు ముఖ్యనేతలంతా.. జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పొంగులేటికి చెక్ పెట్టేందుకు... ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ అడుగులపై.. రకరకాల ప్రచారం సాగుతున్న వేళ.. ఆయన్ని తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ చెప్పడం... చర్చనీయాంశమైంది. సంక్రాంతి తర్వాత ఖమ్మం జిల్లాలో కీలక రాజకీయ సమీకరణాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇవీ చదవండి: