భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక, ఆళ్లపల్లి మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షం రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
మణుగూరులో ఆరబెట్టిన ధాన్యం, లోడ్ ఎత్తేందుకు సిద్ధంగా బస్తాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం పండించిన పంట.. తీరా అమ్మే సమయంలో తడిసినందున రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్‌లో తాటి చెట్టుపై పిడుగు పడింది. మణుగూరు మండలం ముత్యాలమ్మ నగర్‌లో ప్రధాన రహదారిపై పెద్ద చెట్టు విరిగి పడింది.
ఈదురు గాలులతో కూడిన వర్షానికి కూనవరం గ్రామంలో గుర్రం రమేశ్ ఇంటి రేకులు లేచిపోయాయి. ఈ ఘటనలో అతని భార్య గాయపడింది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
పీవీ కాలనీలోని సింగరేణి కార్మికుడు శ్రీనివాస రావు ఇంటిపై మామిడిచెట్టు పడి ఇంటి రేకులు పగిలిపోయాయి. హై ఓల్టేజీ కారణంగా పలు గ్రామాల్లలో విద్యుద్దీపాలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే పెద్దమనసుతో ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం