ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లక్ష్మీపురం వద్ద అదుపు తప్పి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో చర్ల మండలం తేగడకు చెందిన దొడ్డి చిట్టిబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతుడు చిట్టిబాబుతోపాటు భార్య సత్యవతి కుటుంబ సభ్యులు తమ కుమారుడు గియేశ్‌కు వచ్చే నెల 21న వివాహం ఉండటం వల్ల పెళ్లి దుస్తులకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదం చోటు చేసుకోగా తండ్రి మృతి విషాదం మిగిల్చింది. మరో ప్రయాణికురాలు అరుణ పరిస్థితి విషమంగా ఉంది. బస్సు వేగంగా రావడం వల్ల మలుపు ఉండటంతో బస్సు అదుపు తప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సు రహదారిపైనే కొద్ది దూరం దూసుకుపోయి బోల్తా పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్ద మలుపు ఉన్నా ఆర్‌అండ్‌బీ అధికారులు ఎలాంటి ప్రమాద నియంత్రికలు, సూచికలు ఏర్పాటు చేయడం లేదంటూ ఆ ప్రాంతవాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వైరా ఏసీపీ ప్రసన్నకుమార్, కొణిజర్ల ఎస్సై యల్లయ్య క్షతగాత్రులను రెండు 108 వాహనాలతోపాటు ఇతర వాహనాల ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: రైస్ మిల్లులో వ్యక్తి అనుమానాస్పద మృతి