ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం, ఖమ్మం జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ పింఛనుదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు ప్రతి ఒక్క విశ్రాంత ఉద్యోగికి శుభాకాంక్షలు తెలియజేశారు. తమ విద్యుక్త ధర్మం నిర్వహించి పదవీ విరమణ అనంతరం వృద్ధాప్య జీవితం సుఖ సంతోషాలతో గౌరవప్రదంగా జీవించడానికి పింఛను భద్రత కల్పిస్తుందన్నారు. సమాజానికి పింఛనుదారుల సేవలు ఎంతో అవసరమన్నారు. పింఛనుదారులందరూ ఐకమత్యంతో ఉండి, సమాజ సేవలో పాలుపంచుకోవాలని నామ ఆకాంక్షించారు.
మొదటి నుంచి పింఛనుదారులు అండగా ఉండటంతో పాటుగా వారి ఆశీర్వాదంతో పార్లమెంట్‌కు వెళ్లటం జరిగిందని నామ పేర్కొన్నారు. పింఛనుదారుల దినోత్సవం సందర్భంగా సమావేశమై వారి సమస్యలపై చర్చించుకోవటంతో పాటు సమస్యల పరిష్కారానికి అనుసరించవలసిన వ్యూహాల గురించి ఆలోచించటం, సమాజానికి మేలు చేకూరే కార్యక్రమాల గురించి కూడా చర్చించడం అభినందనీయమన్నారు. సమావేశంలో చేసే ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లటంతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో కూడా మాట్లాడతానని ఎంపీ నామ హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: 'దేవాలయ భూములపై గుడ్డిగా సర్కారు వ్యవహరిస్తోంది'