ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను తెరాస లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావు అందజేశారు. మధిర, పాలేరు, వైరా నియోజకవర్గాల్లోని చింతకాని, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, మధిర, కొణిజెర్ల, వైరా, సింగరేణి, బోనకల్ తదితర మండలాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయంలో రూ. 38.8 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఓ వరం లాంటిదని... దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనారోగ్యంతో బాధపడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని నామా పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటిని ప్రజలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని నామా తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, తెరాస నాయకురాలు బేబీ స్వర్ణ కుమారి, బొమ్మెర రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు నామాకు జ్ఞాపిక అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: కళ్లు లేకుంటేనేం... కష్టాలను ఓడించి కలెక్టరయ్యాడు!