వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఖమ్మం నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పాత బస్టాండ్ కేంద్రం, మయూరి కూడలి, పాండు రంగాపురం, ప్రకాష్ నగర్, మోతి నగర్, కవిరాజ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. భారీ వానతో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రేపు, ఎల్లుండి కుండపోత వర్షాలు
మరోవైపు రాష్ట్రంలో రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరం వద్ద అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం వ్యాపించిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో రానున్న రెండ్రోజులు పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: RAINS: భాగ్యనగరంలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం