ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పీఆర్సీ తప్పకుండా వస్తుందని.. అందుకు తాము కూడా పోరాడతామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఖమ్మం జిల్లా కల్లూరులోని ప్రభుత్వ కార్యాలయాలను ఎమ్మెల్యే సందర్శించారు. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ఉద్యోగులను అభ్యర్థించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు ప్రభుత్వంతో చిన్నపాటి సమస్యలు ఉన్నాయని.. వాటిని దృష్టిలో పెట్టుకోకుండా పల్లాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సండ్ర విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయడంలో ముఖ్యమంత్రి చూపిన చొరవను ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, జడ్పీటీసీ సభ్యులు అజయ్ కుమార్, సర్పంచ్ నీరజ, మండల పార్టీ అధ్యక్షుడు రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెరాస ప్రవేశపెట్టింది'