Minister Puvvada Fires on Congress : బీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న అనేక పథకాలను.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా కాపీ కొట్టిందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు (Congress Six Guarantees) కొట్టుకుపోయాయని అన్నారు. ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో అభ్యర్థులతో మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామ నాగేశ్వర రావు, వద్దిరాజు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Puvvada Fire on Tummala Nageshwararao : తుమ్మల వల్ల బీఆర్ఎస్‌కు ఒరిగిందేమీ లేదు : పువ్వాడ
Minister Puvvada On Congress Manifesto : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పువ్వాడ తెలిపారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి వేల కోట్ల నిధులు ఇచ్చిన కేసీఆర్‌ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేనిది.. కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో చేసి చూపించిందని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా బీఆర్ఎస్ పథకాల నుంచి కాపీ కొట్టినవేనని అన్నారు. 60 ఏళ్ల పాలనలో.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల బీమా గురించి ఆలోచించిందా అని ప్రశ్నించారు. 2009 మేనిఫెస్టో హామీల్లో ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని మండిపడ్డారు.
"ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కాపీ మ్యాన్ ఫెస్ట్ అన్నారు. ఆయనకో విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నా.. మీ ఆరు గ్యారెంటీల్లో ప్రధానమైన రైతు బంధులాంటి కార్యక్రమంలో ఎకరానికి రూ.15 ఇస్తానని చెప్పింది మీ సొంత తెలివితేటలా. మా రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి రూ. 5వేలు పెంచి ఇస్తామనలేదా. అది కాపీ కాదా..? 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పింఛను కేవలం రూ.200 మాత్రమే దాన్ని వేలల్లోకి తీసుకువెళ్లింది కేసీఆర్." - పువ్వాడ అజయ్‌కుమార్ రెడ్డి, మంత్రి
దేశంలో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌ది అని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సృష్టించిన అనేక సమస్యలను.. బీఆర్ఎస్ ప్రభుత్వ పరిష్కరించిందని తెలిపారు. ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్ పాలన కొత్తేమీ కాదు అన్న ఆయన... ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అనేక ప్రాజెక్టులు కట్టుకున్నామని చెప్పారు.
ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 88 నుంచి 90 స్థానాలు వస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలన్నీ కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పెట్టిందని ఆరోపించిన ఆయన.. పింఛను పథకం బీఆర్ఎస్‌దా.. కాంగ్రెస్‌దా.. దీన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజల మంచి గురించి ఆలోచించాం కాబట్టే.. వైస్ రాజశేఖర్‌రెడ్డి తెచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు పథకాన్ని ఇంకా కొనసాగిస్తున్నామని తెలిపారు. బీమా గురించి ఇప్పుడు ఆలోచిస్తున్న కాంగ్రెస్.. తమ 60 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా కల్పించిందా అని ప్రశ్నించారు.