రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆర్టీసీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం లాభాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటుపరం చేస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం నష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకుంటోందన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజాకర్షక బడ్జెట్ అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని వెల్లడించారు. నేరుగా స్థానిక సంస్థలకు నిధులివ్వడం ద్వారా పల్లెల రూపురేఖలు మరింత మారడం ఖాయమని మంత్రి వ్యాఖ్యానించారు. ఆర్టీసీని గాడిన పెట్టేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు.
ఖమ్మం నగరాభివృద్ధికి 150 కోట్లు కేటాయించడాన్ని స్వాగతించిన ఆయన... ఈనెల 27న మంత్రి కేటీఆర్... జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
షర్మిల స్థాపించబోయే పార్టీపైనా స్పందించిన మంత్రి పువ్వాడ.. తమకు అంత ప్రాధాన్య అంశం కాదన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని రాజ్యాలు చూశారని.. అందరి పాలన చూసిన తర్వాతే కేసీఆర్ పాలన కోరుకున్నారని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు!