ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేందుకే సైకిల్ పర్యటిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నగరంలో.. ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఉదయం సైకిల్‌పై పర్యటించారు. నగర మేయర్ నీరజ, కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు, నగర కమిషనర్ అనురాగ్‌లతో కలిసి నగర వీధుల్లో తిరిగారు.
సుమారు రెండు గంటల పాటు ఒకటో పట్టణం, మూడో పట్టణ ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్లు, మురుగు కాలువలు, ఇంకా అభివృద్ధి చేయాల్సిన కూడళ్లపై అధికారులతో చర్చించారు. ప్రజలతో మాట్లాడారు. మంత్రి అయినప్పటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి సైకిల్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నామని పువ్వాడ తెలిపారు. ఇప్పటి వరకు చాలా సమస్యలు పరిష్కరించామని చెప్పారు. ఈరోజు మూడో పట్టణంలో వీధుల వెడల్పు, అభివృద్ధిని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నారు.
" ప్రతి మూడు నెలలకోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి.. ప్రజాసమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పర్యటించడమే ఈ పర్యటన ఉద్దేశం. ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాం. నగరంలో ఇంటిగ్రేటెడ్ పార్కులు, మోడన్ మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. ఖమ్మం నగరాన్ని గ్రీన్‌ఫీల్డ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. నగరంలో చెట్ల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నాం. లకారం ట్యాంక్ బండ్లో.. వేయి చెట్లు నాటుతున్నాం."
- పువ్వాడ అజయ్, రాష్ట్ర మంత్రి
- ఇదీ చదవండి : సుప్రీంకోర్టు చురుకైన పాత్ర.. పౌర హక్కులకు రక్ష