ఉద్ధండ రాజకీయ నేతల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాను సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాయశక్తులా కృషిచేస్తానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టిన పువ్వాడకు తెరాస శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఒకే వేదికపై ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పాత, కొత్త నేతలంతా సందడి చేయడం.. తెరాస కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపింది.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా...
ఖమ్మం నగరంలోని సర్ధార్ పటేల్ మైదానంలో నిర్వహించిన తెరాస స్వాగతసభలో మంత్రి పాల్గొన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని... జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు.
మంత్రి పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపగా... జిల్లాకు చెందిన ఇద్దరు తెరాస ముఖ్య నేతలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూరంగా ఉండటం విశేషం.
ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్?