ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఏడాది మామిడి దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ప్రకృతి వైపరీత్యాలు, లాక్‌డౌన్ ప్రతికూలంగా మారాయి. తాజాగా కురిసిన వర్షానికి 2087 ఎకరాల్లో మామిడి నేలరాలి కర్షకులకు కన్నీరే మిగిలింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి నాణ్యమైన మామిడి ఇతర ప్రాంతాలకు ఎగమతి అవుతుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి, వేంసూరు, కల్లూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, చంద్రుగొండ, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కూడా పెనుబల్లి, వేంసూరు మండలాల్లోనే గరిష్ఠంగా ఫలరాజు సాగవుతోంది. ఈ రెండు మండలాల్లో తాజాగా కురిసిన వర్షానికి మామిడి నేల రాలి రైతుల ఆశలు ఆవిరయ్యాయి. గత కొద్ది రోజులుగా ఈదురుగాలతో కూడిన వర్షాలు పడుతుండటంతో చేతికొచ్చిన పంట నేలపాలవుతోంది. ఫలితంగా ఏ రైతును కదిలించినా కంట కన్నీరొలొకుతోంది.
ఆ మండలాల్లోనే నష్టం ఎక్కువ?:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పోల్చిచూస్తే ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి, వేంసూరు మండలాల్లోనే ఏకంగా 657 మంది రైతులకు సంబంధించిన 1,287 ఎకరాల్లో మామిడి నేలపాలైంది. కల్లూరు మండలంలోనూ వందల ఎకరాల్లోనే పంట నష్టం వాటిల్లింది.
జిల్లా సాగు విస్తీర్ణం ఖమ్మం 23,000 భద్రాద్రి 4,500
పంట నష్టంపై అంచనా:
మామిడి పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన చేశాను. పంట నష్టంపై అంచనా వేయమని రెవెన్యూ, ఉద్యానశాఖ అధికారులను ఆదేశించాను. అంచనా వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం.
- ఆర్.వి.కర్ణన్, ఖమ్మం కలెక్టర్
ఖర్చులు వచ్చే పరిస్థితి లేదు
30 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాను. కౌలు వ్యయం రూ.6 లక్షలు. మరో రూ.6 లక్షలు పెట్టుబడి అయ్యాయి. ఇటీవల కురిసిన వర్షానికి మామిడి నేలరాలిపోయింది. చెట్ల కింద పడిన మామిడిని చూస్తుంటే కన్నీరు ఆగడం లేదు. సుమారు 30 టన్నుల మామిడి నేలరాలింది. ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు.
- లగడపాటి శ్రీనివాసరావు, పెనుబల్లి మండలం
కౌలు ఎలా చెల్లించాలో
సొంతంగా మూడెకరాలు, కౌలుకు 15 ఎకరాలు తీసుకున్నాను. సుమారు 4 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఈదురుగాల వల్ల 15-20 టన్నుల మామిడి రాలిపోయింది. పెట్టుబడి సొమ్ము కూడా వచ్చే పరిస్థితి లేదు. కౌలు ఇచ్చిన వారికి సొమ్ములు ఎలా చెల్లించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
- గోదా చెన్నారావు, గణేశ్‌పాడు, పెనుబల్లి