ఈత మానవాళికి చాలా మేలు చేస్తోంది. ఈత వల్ల ఖండరాలన్నీ ఉత్తేజమవుతాయి. రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈతతో ఎన్నో లాభాలున్నాయి. కాని దాని వల్ల ఉపయోగాలు పొందాలంటే బద్దకం వదిలి నీట దిగాల్సిందే. దీనిలోని మెలకువలు ఆపోసన పట్టిన ఖమ్మంజిల్లా మధిర వాసులు తెల్లారుజామునే చెరువుల్లో దర్శనమిస్తున్నారు.
మోజు ఉంటే ఈత ఈజీనే
మక్కువ ఉంటే ఈత చాలా ఈజీ.. లేకుంటే ఈతంటే ఈజీ కాదంటున్నారు మధిర వాసులు. ఐదేళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల పెద్దల వరకూ ఈతతో సేదదీరుతున్నారు. ఈత నిత్యకృత్యంగా మారిందని అంటున్నారు నగర వాసులు. గతంలో వీరంతా అంబరుపేట చెరువులో ఈత కొట్టేవారు. అక్కడ నీరు ఇంకిపోయిందని వాహనాలపై కిలోమీటర్ల దూరం ప్రయాణించి వైరా రిజర్వాయర్‌కు వెళ్లైనా సరే ఈత కొట్టాల్సిందేనని చెబుతున్నారు.
ఈతతోనే గుర్తింపు
వీరిలో చాలమంది ఈత పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. విజయవాడలో కృష్ణాబ్యారేజీ వద్ద నిర్వహించిన రివర్‌క్రాసింగ్ ఈతపోటీల్లో పాల్గొని బహుమతులు పొందారు. కొందరైతే ఏకంగా నీటిలో యోగాసనాలు వేస్తూ విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. దైనందిన జీవితంలో ఒత్తిడిని అధిగమించేందుకు ఈత దివ్యఔషధమని స్థానికులు చెబుతున్నారు. ఈత వల్లే తామంతా ఆరోగ్యంగా ఉంటున్నామన్నారు.