అకాల వర్షానికి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో ధాన్యం తడిసిపోయింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షార్పణం అయ్యింది. భద్రాద్రి జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలం, దమ్మపేట మండలాల్లో భారీ వర్షం వల్ల మొక్కజొన్న పొలాలు నేలవాలాయి.
మిరప: కళ్లాల్లో, తోటల్లో ఉంది. ప్రస్తుతం విపణి లేకపోవటం వల్ల అమ్ముకునే పరిస్థితిలేక అక్కడే ఉంచారు. ఇళ్ల దగ్గర కొంత ఉంది. శీతల గిడ్డంగుల్లో అంతా వ్యాపారుల సరుకే ఉండటం వల్ల అక్కడ భద్రపరుచుకునే పరిస్థితి లేదు.
వరి: కొంత ధాన్యం ఆరబెట్టి ఉండగా, మరికొంత పొలాల్లో కోతకు సిద్ధంగా ఉంది. వర్షం పడితే కోతకు వచ్చిన పంట మొత్తం రాలిపోతుంది. ఇప్పుడే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. సరిపోయేటన్ని పట్టాలు లేవు.
మొక్కజొన్న: కొంత చేతికి రాగా మరికొంత చేతికందటానికి సిద్ధంగా ఉంది. వర్షం కురిస్తే పంట నేలవాలిపోతుంది. కంకి దెబ్బతిని రంగు మారుతుంది. సరైన గిట్టుబాటు ధర ఉండదు.
ఉద్యానం: ఉద్యాన పంటల్లో అధిక శాతం మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఏడాది పూత రాలిపోయి కాత ఎక్కువగా రాలేదు. తోటలు దెబ్బతిని రైతులు, వ్యాపారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అమ్ముకునేందుకు మార్కెట్ కూడా లేదు. ఇప్పుడు వర్షంతో పంట చాలావరకు దెబ్బతినే ప్రమాదం ఉంది.
‘‘ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 24 గంటల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, వడగండ్లు పడే ప్రమాదం ఉంది. గంటకు 30 నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు వస్తాయి. రైతులు ఎండబెట్టిన ధాన్యం, కళ్లాల్లో ఉన్న మిరప, మొక్కజొన్నలను కాపాడుకోవాలి. కొనుగోలు కేంద్రాల వద్ద పట్టాలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అవసరం లేని వారినుంచి సేకరించి రైతులకు అందిస్తున్నాం.’’
- విజయనిర్మల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఖమ్మం
ఇదీ చూడండి: భారత్కు ఏడీబీ 220 కోట్ల డాలర్ల సాయం