TRS Youth leader love marriage: ఇటీవలే.. ప్రేమికుడి ఇంటి ముందు మౌనదీక్ష చేసిన యువతి కథ అప్పుడే సుఖాంతమైందనుకుంటే.. మళ్లీ వార్తల్లో నిలిచింది. అప్పుడు కుటుంబసభ్యులు, పలు ప్రజాసంఘాలు, పోలీసుల సమక్షంలో బలవంతంగానే పెళ్లికి ఒప్పుకున్న యువకుడు మళ్లీ.. ముఖం చాటేయంటంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈసారి ఆ అమ్మాయి ఎలాంటి దీక్షలకు పోకుండా.. నడిరోడ్డుపైనే ప్రియున్ని నిలదీసింది. తాళిబొట్టు చేతబట్టి.. అక్కడే పెళ్లిచేసుకోవాలంటూ డిమాండ్ చేసింది. ఇంత రచ్చ తర్వాత.. ఎట్టకేలకు అమ్మాయి మెళ్లో మూడు ముళ్లు పడ్డాయి.
అసలు విషయం ఏంటంటే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం 21 ఫీట్ ఏరియాలో బాధిత యువతి(21).. తెరాస యువజన నాయకుడైన గుడిబండ్ల శ్యామ్(28) మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రేమించటం వరకు అంతా సవ్యంగానే ఉన్నా.. పెళ్లి పేరు ఎత్తితే మాత్రం దాటేస్తూ వస్తున్నాడు. తనను పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన అమ్మాయి.. స్థానిక పెద్దమనుషులను సంప్రదించింది. ఇరువురి తల్లిదండ్రులతో మాట్లాడిన పెద్దమనుషులు.. డిసెంబర్లో వివాహానికి నిశ్చయించారు.
మౌనదీక్షతో పోరాటం..
అప్పుడైనా సరిగ్గా ఉన్నాడా అంటే.. అదీ లేదు. పెళ్లి నిశ్చయమైన నాటి నుంచి ముఖం చాటేయటం ప్రారంభించాడు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి.. తప్పించుకుని తిరగుతున్నాడు. ప్రేమ పేరుతో వాడుకుని పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ.. ప్రియుని ఇంటి ముందు ఆ యువతి మౌనదీక్ష చేసింది. ఈ దీక్షకు కుటుంబసభ్యులు సహా.. పలు ప్రజాసంఘాలు కూడా మద్దతిచ్చాయి. చివరికి వీళ్ల వ్యవహారం.. పోలీసుల వద్దకు చేరింది. అందరి సమక్షంలో యువతిని పెళ్లి చేసుకునేందుకు యువకుడు ఎట్టకేలకు అంగీకరించాడు. ఇక దీంతో కథ సుఖాంతం అయ్యిందనుకున్నారు.
నడిరోడ్డుపై నిలదీస్తే..
కానీ.. యువకుడు మళ్లీ మొదటికే వచ్చాడు. పెళ్లికి నిరాకరిస్తుండటంతో.. యువతితో పాటు ఆమెకు సంబంధించిన బంధువులు యువకున్ని నడిరోడ్డుపైనే నిలదీశారు. తాళి చేతపట్టుకుని తనను పెళ్లి చేసుకోవాలని.. వేడుకుంది. కాళ్లు కూడా పట్టుకుని బతిమిలాడింది. తాను పెళ్లి చేసుకోకపోతే పురుగుల మందు తాగి చనిపోవటమే దారి అని తేల్చిచెప్పింది. అయినా ఆ యువకుడు ఒప్పుకోకపోవటం వల్ల.. కుటుంబసభ్యులు, ప్రజాసంఘాల నాయకులు ఇల్లందు నుండి గుండాల ప్రధాన రహదారి 21 ఫీట్ ఏరియా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. యువతి మెడలో తాళి కట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
చిట్టచివరికి ముడిపడ్డ మూడు ముళ్లు..
ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. ఇద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇప్పటికే ఓసారి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు పెళ్లికి ఒప్పించారు. అప్పుడు వాళ్ల సమక్షంలో పెళ్లికి నిశ్చయిస్తేనే చేసుకోకుండా తప్పించుకున్న యువకునికి.. ఈసారి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ రమేష్ గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎట్టకేలకు పెళ్లికి ఒప్పించి.. వాళ్ల సమక్షంలోనే అమ్మాయి మెళ్లో మూడు ముళ్లు వేయించారు. మొత్తానికి ఇన్ని మలుపుల తర్వాత.. వాళ్ల ప్రేమ కథ సుఖాంతమైంది.
ఇవీ చూడండి: