Kishan Reddy Comments on BRS in BJP Public Meeting Khammam : ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్&బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో.. రైతు గోస- బీజేపీ భరోసా సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హోం మంత్రి అమిత్ షా(Amit Shah) హాజరయ్యారు. ఈ క్రమంలోనే కమలం నేతలు ఆయనను గజమాలతో సత్కరించారు. ఖమ్మం గడ్డపై నుంచి రైతుకు భరోసా కల్పిస్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. రజాకార్ల సమయంలో హిందువులను ఎలా ఊచకోత కోశారో మనకు తెలుసని కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. అభినవ సర్దార్ పటేల్ అని కిషన్‌రెడ్డి కొనియాడారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ముఖ్యమంత్రి పాలనలో పాలనలో వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వట్లేదని మండిపడ్డారు. వరి వేయవద్దని బీఆర్ఎస్ ప్రభుత్వమే చెబుతోందని అన్నారు. వ్యవసాయ రుణాలు పావలా వడ్డీకి ఇవ్వట్లేదని తెలిపారు. అన్నదాతల ఆత్మహత్యల్లో 75 శాతం కౌలురైతులే ఉంటున్నారని కిషన్‌రెడ్డి వివరించారు.
కల్తీ సీడ్ బౌల్‌గా తెలంగాణ మారే పరిస్థితి వచ్చిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఉచిత ఎరువులు ఇస్తామని ఉత్తర కుమారునిలా ప్రగల్భాలు పలికారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు తూతూమంత్రంగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేస్తున్నారని విమర్శించారు. మెజారిటీ అన్నదాతలకు రుణమాఫీ కావట్లేదని ఆక్షేపించారు. కేసీఆర్ సర్కారు కర్షకులను వెన్నుపోటు పొడిచిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్ సర్కారు పంటల బీమా పథకం అమలు చేయడంలేదని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. లక్షలాది రైతులు పంటనష్టం సాయం అందుకోలేకపోయారని విమర్శించారు. ఈ క్రమంలోనే కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. అన్నదాతలు నష్టపోతున్నారని తెలిపారు. ధరణి పరిస్థితి "కొండనాలుకకు మందు వేస్తే..” అన్నట్టు తయారైందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
"బీజేపీకి అధికారమిస్తే రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్.. రెండూ కుటుంబ పార్టీలే. బీఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్టే. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటేసినట్టే. బీఆర్ఎస్, కాంగ్రెస్.. దేనికి ఓటేసినా మజ్లిస్‌కు ఓటేసినట్టే. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్.. ఈ మూడు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే." - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఖమ్మం గడ్డ నుంచి తెలంగాణ రైతులకు భరోసా ఇచ్చేందుకు అమిత్ షా వచ్చారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. నాలుగున్నరేళ్లుగా కేసీఆర్ రుణమాఫీ చేస్తామని మోసం చేశారని విమర్శించారు. రింగ్‌రోడ్డు, హైదరాబాద్ భూములు అమ్మి రుణమాఫీ చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఇచ్చే అనేక సబ్సిడీలను ముఖ్యమంత్రి ఎత్తేశారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
బీజేపీకి అధికారమిస్తే కిలో తరుగు కూడా లేకుండా పంటంతా కొంటామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఎత్తేసిన సబ్సిడీలను.. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పారు. బంగారు తెలంగాణ మాటల్లోనే కానీ.. చేతల్లో లేదని విమర్శించారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
అవినీతిపరుల గుండెల్లో అమిత్ షా చిచ్చర పిడుగు అని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా.. ఖమ్మం జిల్లా అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి మళ్లీ మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని ఆరోపించారు. సీఎంకు ఎన్నికలు వస్తేనే హామీలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. కేసీఆర్, కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని.. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే తెలంగాణ బాగుపడుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Kishan Reddy Fires on BRS : బీఆర్ఎస్తో ఇక యుద్ధమే : కిషన్‌రెడ్డి