వామన్‌రావు న్యాయవాద దంపతుల హత్యకేసు నిందితులకు తక్షణమే శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై జిల్లా కోర్టు న్యాయవాదులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రంలో న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు.
వామన్ రావు దంపతులు సామాన్యుల తరఫున, ప్రజాప్రతినిధుల ఆక్రమాలపై న్యాయం కోసం పోరాడేవారన్నారు. ఈ హత్యలపై హైకోర్టు ప్రత్యేక అధికారితో విచారణ జరపాలని, సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలన్నారు. పేదల పక్షాన పోరాడే న్యాయవాదులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు.