పురపాలికగా సుమారు 50 ఏళ్లు మనుగడలో ఉన్న ఖమ్మం... 2012లో చుట్టుపక్కల పంచాయతీలను కలుపుకొని నగర పాలక సంస్థగా మారింది. అయినా ఐదేళ్ల వరకు సరైన మార్కెట్ లేక ప్రజలు ఇబ్బందుల పడ్డారు. వైరా రోడ్డులో నాన్‌వెజ్ మార్కెట్ ఉండేది. ప్రధాన కూడలిలో ఉండటంతో నిత్యం పశువులు, చేపల వ్యర్థాలతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉండేది.
రూ. 4 కోట్లతో...
బస్టాండ్ సమీపంలో ఉన్న రైతుబజార్‌లో సరిపడా స్థలం లేక రైతులు అవస్థలు పడేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు, పాలక పక్షం నాయకులు... ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులో విశాలమైన స్థలంలో సమీకృత రైతుబజార్‌ను ఏర్పాటు చేశారు. కూరగాయలు, చేపలు, మాంసం విక్రయాల కోసం పరిశుభ్రమైన స్టాళ్లు ఏర్పాటు చేశారు. సుమారు రూ. 4 కోట్లతో నిర్మాణం పూర్తిచేసి 2 నెలల క్రితం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం రోజుకు 2 నుంచి 3వేల మంది వినియోగదారులు మార్కెట్‌కు వస్తున్నారు.
రైతుల హర్షం...
మార్కెట్ ఏర్పాటుపై నగరవాసులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌పై మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరముందని రైతులు అభిప్రాయపడుతున్నారు. రైతుబజార్ మార్చిన విషయాల్లో ప్రజలకు తెలియజేస్తే తమకు గిరాకీ మరింత పెరుగుతుందని చెబుతున్నారు.
మారిపోనున్న రూపురేఖలు...
ప్రజల్లో సరైన అవగాహన లేదనే ఆందోళన వద్దని రైతులకు అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఖమ్మం నగరానికి నూతన మార్కెట్ అడ్డాగా మారబోతోందని భరోసా కల్పిస్తున్నారు. నూతనంగా నిర్మితమవుతున్న బస్టాండ్ అందుబాటులోకి వస్తే రైతుబజార్‌కు వినియోగదారుల తాకిడి మరింత పెరుగుతుందని అధికారులు చెబతున్నారు. కొత్తగా రానున్న బస్టాండ్ నిర్మాణంతో ఖమ్మం రూపురేఖలు మారిపోతాయని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలి: హరీశ్