ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో త్వరలో ఉచితంగా దాదాపు 57 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం పేరుతో అందుబాటులోకి రానుంది. కేంద్రానికి వచ్చే రక్త నమూనాలను సెంట్రిఫ్యూజ్ చేసేందుకు 4 మిషన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రసాయనాల కిట్లను భద్రపరిచేందుకు అత్యాధునిక శీతల గది, ఎమటాలజీ పరికరం ఈ కేంద్రంలో కొలువుదీరింది.
ఎక్కడాలేని పరికరం ఇక్కడే..
అత్యంత వేగంగా పదుల సంఖ్యలో పరీక్షలు చేసేలా యూరిన్ ఎనలైజర్ దోహదపడనుంది. ఇంకా హార్మోన్ పరీక్షలు చేసే ఇమ్యున్ ఎనలైజర్ పరికరమూ అందుబాటులో ఉంది. థైరాయిడ్ వ్యాధి నిర్ధారణకు దోహదపడుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేని బయో కెమిస్ట్రీ ఎనలైజర్ పరికరం కూడా.. ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది.
టీ డయాగ్నస్టిక్..
ప్రభుత్వ ఆస్పత్రి రోగులు, వెల్నెస్ సెంటర్‌కు వచ్చే బాధితులు.. 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స తీసుకునే రోగుల.. రక్త నమూనాలను సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. జిల్లాను మూడు రూట్లుగా విభజించి నమూనాల సేకరణ వాహనాలు ఏర్పాటు చేసి.. రోగుల నుంచి సేకరించిన నమూనాలను కోల్డ్ బాక్స్‌లో నిల్వ చేసుకొని జిల్లా కేంద్రంలోని టీ డయాగ్నస్టిక్ కేంద్రానికి తీసుకొస్తారు.
ప్రత్యేక శిక్షణ..
ఈ కేంద్రంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 25 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వివరాలను రోగుల చరవాణి, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నారు. క్షయ నిర్ధారణ కోసం పీహెచ్‌సీల నుంచి తెమడ పరీక్షల నమూనానూ సేకరించేలా ఏర్పాట్లు చేశారు. కేంద్రంలో ఒక పాథాలజిస్ట్, బయో కెమిస్ట్ తర్పీదు పొందిన పది మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉంటారు. పీహెచ్‌సీల్లో ఒక్కొక్కరికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు.
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా సాగుతుండగా.. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ఇవీచూడండి: ఖమ్మం నూతన బస్టాండు ప్రారంభంపై సందిగ్ధత