Khammam Farmers Are Facing Difficulties To Sell Crops: ఖమ్మం గ్రామీణం మండలానికి చెందిన మదన్‌సింగ్ అనే రైతు నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్‌కు సరుకు తీసుకొచ్చారు. మార్కెట్ యార్డులో మిర్చి బస్తాలు దించిన రైతు.. సరుకు విక్రయించేందుకు అక్కడి కమీషన్ వ్యాపారులను సంప్రదించాడు. ఈలోగా అక్కడికి వచ్చిన ఓ కమీషన్ వ్యాపారి.. తనకు తెలియకుండా పంటను ఎలా అమ్ముతున్నావంటూ మదన్‌సింగ్‌ను నిలదీశాడు.
నా ఇష్టం వచ్చినవారికి అమ్ముకుంటానంటూ రైతు బదులిచ్చాడు. దీనికి స్పందించిన కమీషన్ వ్యాపారి... తన దగ్గర పంట సాగుకోసం డబ్బు అప్పుగా తీసుకుని ఇప్పుడు వేరేవారికి ఎలా అమ్ముతావని వాగ్వాదానికి దిగాడు. పంటను అమ్మిన తర్వాత నీ అప్పు తీరుస్తానంటూ రైతు బదులివ్వడం, తర్వాత ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. కమీషన్ వ్యాపారి తరపున రంగంలోకి దిగిన ఇతర కమీషన్ దారులు మార్కెట్‌లో ఆందోళనకు దిగారు.
Farmers Are Facing Difficulties: చివరకు రైతుతో క్షమాపణ చెప్పించడంతో వివాదం సద్దుమణిగింది. ఖమ్మం మార్కెట్‌లో నిన్న జరిగిన ఈ ఘటన.. కమీషన్ దారుల ఆగడాలకు నిదర్శనంగా నిలుస్తోంది. వాస్తవానికి రైతులకు-కమీషన్‌దారులకు అవినాభావ సంబంధం ఉంటుంది. రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించిన అన్నదాతకు.. మార్కెట్‌లో అన్నీ తామై పంట ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు విక్రయించి, వారి మన్ననలు పొందేవారు కమీషన్ వ్యాపారులు.
మార్కెట్‌లో సుదీర్గ అనుభవం ఉన్న కమీషన్ దారులు చాలామందే ఉన్నారు. రైతులతో తత్సంబంధాలు కొనసాగిస్తూ.. వారి పంటలకు పెట్టుబడి అందిస్తారు. అయితే ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు కమీషన్ వ్యాపారుల అవతారం ఎత్తి... రైతుల బలహీనతను ఆసరాగా చేసుకుని పీల్చి పిప్పిచేస్తున్నారు. ఖమ్మం మార్కెట్‌లో మొత్తం 419 మంది కమీషన్ వ్యాపారులు ఉండగా.. అనధికారికంగా మరో 150 మంది ఉన్నారు.
కోటి ఆశలతో పంటను మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా సరుకు అమ్మిపెట్టడం కమీషన్ దారుల బాధ్యత. రైతు తెచ్చిన సరుకును వ్యాపారులకు చూపించి.. పోటీ పెట్టి రైతుకు గిట్టుబాటు ధర అందించేలా చొరవ చూపాలి. ఇందుకుగానూ రైతులు నూటికి రూ.2 చొప్పున వారికి కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కమీషన్ దారులు ఎక్కడా మార్కెట్ నిబంధనలు పాటించడం లేదు.
రైతు బలహీనతలు ఆసరాగా చేసుకుని.. వాళ్లు వడ్డీ వ్యాపారం: రైతుపై కమీషన్ దారుల పెత్తనం పెరిగి, ఏకంగా రూ.4 కమీషన్ వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా రైతు అమ్మిన సరుకుకు సంబంధించిన డబ్బులు తక్షణమే చెల్లిస్తే.. అందులోనూ నూటికి రూ.2 చొప్పున కట్ చేసి రైతులకు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంతేకాకుండా రైతు ఆర్థిక బలహీనతలు ఆసరాగా చేసుకుని కమీషన్ వ్యాపారులు వడ్డీ వ్యాపారం మొదలుపెట్టారు.
మార్కెట్లో క్రయవిక్రయాల్లో అవకతవకలు: అధిక వడ్డీలు వసూలు చేయడంతోపాటు మార్కెట్‌కు పంటను తీసుకొచ్చిన సమయంలో వారిపై పెత్తనం చెలాయించి పంటను ఇష్టానుసారం విక్రయిస్తున్నారు. ఇదంతా ఒకఎత్తైతే యార్డు లోపల క్రయవిక్రయాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కమీషన్ దారులు-ఖరీదు దారులు కుమ్మక్కై ధరలు మాట్లాడుకున్న తర్వాత రైతులతో బేరమాడుతున్నారు.
200 నుంచి 300 ఒక్కో క్వింటాకు ఎక్కువ ధర మాట్లాడుకుని రైతుతో మాత్రం ధర తక్కువే మాట్లాడుతున్న పరిస్థితులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్‌లో సాగుతున్న క్రయవిక్రయాలు, కమిషన్‌దారుల నిర్వాకంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖలోని విజిలెన్సు విభాగానిదే. కానీ ఏళ్ల తరబడి విజిలెన్సు బృందాలు మార్కెట్ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలే లేవు. ఇక తనిఖీలు, సోదాలు అన్న ఊసే లేకుండా పోయింది.
ఇవీ చదవండి: