Kerala CM Vijayan on National Politics: కేంద్ర వైఖరితో రాజ్యాంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. ఖమ్మం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. జాతీయ రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్ నడుం బిగించారని చెప్పారు. తెలంగాణ తరహాలోనే కేరళ కూడా అనేక పథకాలు చేపట్టిందని స్పష్టం చేశారు.
''తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ. తెలంగాణ సాయుధ పోరాటం భూసంస్కరణలకు కారణమైంది. స్వాతంత్య్ర సమరంలో పాల్గొనని శక్తులు కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. కార్పొరేట్ శక్తులకే కేంద్రం ఊతమిస్తోంది. కేంద్ర వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడుతోంది. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం యత్నిస్తోంది. వన్ నేషన్-వన్ ట్యాక్స్, వన్ నేషన్ -వన్ ఎలక్షన్ వంటి నినాదాలు సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయి.'' - కేరళ సీఎం విజయన్
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్తంగా దేశాన్ని పాలిస్తున్నాయని విజయన్ ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కబళిస్తోందని తెలిపారు. సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం దెబ్బతీస్తోందని విమర్శించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ బలహీనపరుస్తోందని చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వాలను అనైతిక పద్ధతుల్లో కూలదోస్తోందని వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది దేశ విశిష్టత అని వివరించారు.
''ఏ భాషకు ఆ భాష ప్రత్యేకమైనది. హిందీని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం జరుగుతోంది. న్యాయ వ్యవస్థలో కేంద్రం మితిమీరిన జోక్యం చేసుకుంటోంది. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీస్తోంది. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. ఉపరాష్ట్రపతి కూడా రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రాలకు నిధుల పంపకంలో వివక్ష చూపుతున్నారు. జీడీపీ, పారిశ్రామిక వృద్ధి క్షీణిస్తోంది.'' - కేరళ సీఎం విజయన్
విదేశీ మారకనిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయన్న విజయన్... పెట్రో ధరల పెంపుతో జనజీవనం అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు. 80 శాతం ప్రజలు పేదరికంలోకి వెళ్లే దుస్థితి నెలకొందని ఆందోళన చెందారు.
ఇవీ చూడండి: