Japan Woman Get Married With Indian Guy: ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి భేదాలు ఉండవని నిరూపించారు ఈ ఇద్దరు ప్రేమికులు. దేశాలు వేరైనా వారి మనసులు కలిశాయి. కులం, మతం, ప్రాంతం అన్న భేదం లేకుండా వారు ఇద్దరు ఇష్టపడ్డారు. సాంప్రదాయాలు వేరైనా.. పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించారు. పెద్దలు కూడా పిల్లల ఇష్టాన్ని కాదనకుండా వాళ్ల ఇష్టమే వీరి ఇష్టంగా భావించారు. ఫలితంగా హిందూ సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా వారి వివాహం జరిగింది. వివరాల్లోకి వెళితే..
పరిచయం కాస్త.. ప్రేమగా మారి.. వివాహం వరకు: హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు కాపర్తి జగన్నాథ చారి కుమారుడు ఆకాశ్ జపాన్‌లో స్థిరపడ్డాడు. ఒక కంపెనీలో ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. జపాన్‌కు చెందిన శినోబు ఖను కుమార్తె మీకెలా హెచ్ఆర్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆకాశ్, మికేలాలకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆకాశ్ వారి తల్లిదండ్రులను ఒప్పించగా, మీకెలా కూడా వారి తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి చెప్పి పెళ్లికి ఒప్పించింది.
అంగరంగ వైభవంగా పెళ్లి: అయితే వీరు భారతదేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆకాశ్ తండ్రి జగన్నాథ చారి భద్రాద్రి రామయ్యపై ఉన్న భక్తితో భద్రాచలం సీతారాముల ఎదుట ఆలయంలోనే వివాహం చేయాలని నిశ్చయించారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఇరువర్గాల తల్లిదండ్రుల సమక్షంలో భారత దేశం, జపాన్‌కు చెందిన పెద్దల ఆశీస్సుల నడుమ వివాహం చేసుకున్నారు.
ఎలాంటి భావన లేకుండా.. అందరూ ఆనందంగా: హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్దలను ఒప్పించి భారతదేశంలో ప్రేమ వివాహం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని పెళ్లి కుమారుడు ఆకాశ్, పెళ్లి కుమార్తె మీకెలా తెలిపారు. తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకోవడం, తన కుమారుడికి తగిన సంబంధం దొరకడం చాలా గర్వంగా ఉందని.. వీరి వివాహ జీవితం వందేళ్ల పాటు సంతోషంగా, ఆనందంగా వర్ధిల్లాలని ఆకాశ్ తండ్రి జగన్నాథ చారి ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: